ఆ ఎన్నికలో 200 మంది జర్నలిస్టులు పోటీ

by Anukaran |   ( Updated:2021-03-01 07:53:18.0  )
ఆ ఎన్నికలో 200 మంది జర్నలిస్టులు పోటీ
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో 200 మందికి పైగా ప్రాంతీయ ప‌త్రిక‌ల ఎడిట‌ర్లు, విలేక‌ర్లు పోటీ చేయ‌నున్నట్టు చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు ప్రకటించారు. ఎంపానెల్ అయిన ప్రాంతీయ పత్రికలకు తెలంగాణ సమాచార శాఖ రెండున్నర సంవత్సరాల నుంచి అటెండెన్స్ నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి స‌హ‌కారం అందించ‌లేదని.. ఈ కార‌ణంతోనే పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

సోమ‌వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా, మ్యాగజైన్‌లకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకుండా నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తోంద‌న్నారు. దీనిపై చాలాసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించుకున్నా, ధర్నాలు చేసినా ఫలితం దక్కలేదని వాపోయారు. దీంతో చివరగా చిన్న పత్రికలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తీర్మానించుకున్నామని తెలిపారు.

ఎన్నిక‌ల్లో గెలిచే సత్తా ఉన్న ప్రతిపక్ష పార్టీకి మద్దతు పలుకుతామని యూసుఫ్ బాబు చెప్పారు. అంతే కాకుండా, నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో 200 మందికి పైగా ప్రాంతీయ పత్రిక‌ల ఎడిట‌ర్లు, విలేకరులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా వివ‌క్ష ధోర‌ణిని విడాలని, అవినీతి అధికారుల‌ను తొల‌గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బంగారు తెలంగాణలో జర్నలిస్టుల బతుకులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలియజేస్తామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్ పేపర్స్, మ్యాగజైన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వై.అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story