హుజురాబాద్‌లో ఈటలకు షాక్

by Anukaran |   ( Updated:2021-06-28 02:32:22.0  )
Etala Rajender
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ బీజేపీ నేతలు షాకిచ్చారు. ఇల్లందకుంట మండల బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండల ప్రధాన కార్యదర్శి తోడేటి జితేంద్ర గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉడుత రత్నాకర్, యువ మోర్చా అధ్యక్షుడు గుత్తికొండ పవన్‌తో పాటు 200 మంది బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 20 ఏళ్లుగా బీజేపీతో ఉన్నామని, ఈటల వైఖరిని నిరసిస్తూ ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. సీనియర్లను కాదని ఈటల తన అనుచరులతోనే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్‌ను విస్మరించి తన అచరులతోనే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారని, పార్టీ బాధ్యులుగా ఉన్న తాము అధ్యక్షత వహించాల్సి ఉన్నప్పటికీ.. ప్రాధాన్యత లేకుండా పోయిందని బీజేపీ నాయకులు వాపోయారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరుతున్నారని జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినప్పుడే తాము ఆయన భావజాలన్ని వివరించినప్పటికీ అధిష్టానం వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈటల పార్టీలో చేరిన తరువాత తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ముందు కూడా ప్రతిపాదన పెడితే మీరున్నదే నలుగురు అన్న రీతిలో ఆయన అనుచరులు కామెంట్ చేశారని ఇల్లందకుంట మండల అధ్యక్షుడు తనువుల రవి యాదవ్ అన్నారు. హిందూ ధర్మం, సంస్కృతి కోసం తాము అనుభందం పెనవేసుకున్నప్పటికీ బీజేపీని వీడడానికి ఈటలయే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈటల ఎంట్రీ తరువాత జిల్లా నాయకత్వానికి తమకు తగ్గిన ప్రాధాన్యత గురించి చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో హుజురాబాద్ ఉపఎన్నిక జరగనున్న తరుణంలో నేతలు ఈటల వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed