సీట్ కవర్.. క్రాప్‌టాప్‌గా అమ్మేసింది!

by Shyam |
సీట్ కవర్.. క్రాప్‌టాప్‌గా అమ్మేసింది!
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకూ ‘ఫ్యాషన్’ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏ ఫ్యాషన్ ఎప్పుడు ట్రెండ్ అవుతుందో చెప్పలేకున్నాం. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్.. రేపటికల్లా అవుట్‌డేట్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చిరుగుల జీన్స్, పొట్టి ప్యాంట్, రఫుల్ హ్యాండ్స్.. ఇలా కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అన్నట్టుగా ఫ్యాషన్ ప్రపంచం దూసుకెళ్తోంది. మొన్నటికి మొన్న పచ్చగడ్డి మరకలంటిన ప్యాంట్‌ను డిజైన్ చేసిన ఓ ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్.. ప్యూర్ ఆర్గానిక్ డెనిమ్ జీన్స్ పేరుతో మార్కెట్‌లో విడుదల చేసింది. ఆ తర్వాత మరో బ్రాండ్.. చిరిగిన సాక్స్‌లను అత్యధిక ధరతో అమ్మకానికి పెట్టింది. ఇలా అనేక ఫ్యాషన్ బ్రాండ్స్ తమ ఉత్పత్తులతో మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. కానీ అందులో యూనిక్ ఉంటేనే ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకోవచ్చు. ఈ క్రమంలోనే యూకేకు చెందిన ఓ ఫ్యాషన్ స్టూడెంట్.. డిస్కార్డెడ్ ట్రైయిన్ సీట్ కవర్స్‌ను ‘క్రాప్ టాప్స్’గా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

‘కొవిడ్ 19’ నేపథ్యంలో యూకేలోని చిల్టర్న్ రైల్వేస్.. ప్రయాణికుల క్షేమం కోసం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని తెలిపే సైన్స్‌తో కూడిన సీట్ కవర్స్ రూపొందించింది. ఇటీవలే ఆ రైళ్లో ప్రయాణించిన 20 ఏళ్ల మారీ థర్స్‌‌టన్ టైలర్.. రెండు సీట్ కవర్లను తనతో పాటు తీసుకెళ్లింది. ఆ రెండింటిలో ఒకదాన్ని తను క్రాప్ టాప్‌గా ధరించగా, రెండో దాన్ని మాత్రం.. ‘డెపాప్’(సెకండ్ హ్యాండ్ దుస్తులు కొనడానికి, విక్రయించడానికి వినియోగించే షాపింగ్ అప్లికేషన్)లో రూ. 1500/-కు అమ్మకానికి పెట్టింది. కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి, సైజ్ వివరాలు ఇతర సందేహాలతో పాటు కొనాలనుకునే వాళ్లు మెసేజ్ చేయొచ్చని ఆ సైట్‌లో పేర్కొనగా, వెంటనే ఆ క్రాప్ టాప్ అమ్ముడపోయింది. అయితే రైల్వే ఆస్తిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడం నేరమని ఆమె తెలుసుకోలేకపోయింది. మారీ పెట్టిన పోస్ట్‌ను గమనించిన డెపాప్ నిర్వాహకులు.. ‘మా నిబంధనలు ఉల్లంఘించిన మారీని క్షమించి వదిలేస్తున్నాం. కానీ వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి కస్టమర్‌కు డబ్బులు చెల్లించాలి’ అని చెప్పినట్టు నిర్వాహకులు వెల్లడించారు. దాంతో ఆమె పోస్ట్ డిలీట్ చేసి, మనీ వాపస్ ఇచ్చేసింది. అయితే మారీ మాత్రం అవి దొంగలించలేదని, ప్లాట్‌ఫాం మీద పడి ఉండటంతోనే వాటిని ఇంటికి తీసుకెళ్లానని వెల్లడించింది. డెపాప్ నిర్వాహకులు ఈ పోస్ట్‌ను తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టగా, వైరల్‌గా మారింది.

కానీ ఈ సంఘటనను బట్టి తెలిసిందేమిటంటే.. ‘ఫ్యాషన్’ పేరుతో ఏదైనా అమ్మొచ్చు, ఏదైనా కొనొచ్చు. నిజమే కదా!

Advertisement

Next Story