గంటగంటకు పెరుగుతున్న విమాన ప్రమాద మృతుల సంఖ్య

by Anukaran |   ( Updated:2020-08-07 23:06:42.0  )
గంటగంటకు పెరుగుతున్న విమాన ప్రమాద మృతుల సంఖ్య
X

దిశ, న్యూస్ బ్యూరో: కేర‌ళ‌లోని కోళికోడ్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 17 మంది మృతిచెందారు. ‘వందే భారత్’ స్కీంలో భాగంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7.41 గంటలకు కోళికోడ్ విమానాశ్రయంలో లాండ్ కావాల్సి ఉంది. ఎయిర్ ఇండియాకు చెందిన (ఐఎక్స్ – 1344) విమానంలో ఆ సమయంలో 174 మంది ప్రయాణీకులు, పది మంది చిన్నపిల్లలు, ఐదుగురు విమాన సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే ప్రధాన పైలట్ కెప్టెన్ దీపక్ వసంత్ సాథే ఈ ప్రమాదంలో మరణించినట్లు అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ రెండో పైలట్ గురించి ప్రస్తావించలేదు. మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

కోళికోడ్ విమానాశ్రయంలో లాండింగ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి రన్‌ వే నుంచి జారి లోయలో పడి రెండు ముక్కలైంది. విమానం ముందుభాగం తీవ్రంగా దెబ్బతిన్నది. మృతులంతా విమానం ముందుభాగంలో ఉన్నవారేనని అనుమానం. విమానం లాండ్ కావడానికి మొదటిసారి ప్రయత్నం చేసినప్పుడు సాధ్యం కాకపోవడంతో ప్రధాన పైలట్ దీపక్ వసంత్ సాథే మళ్ళీ టేకాఫ్ చేసినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది తెలిపారు. రెండోసారి ప్రయత్నంలో రన్‌వేపై లాండింగ్ అవుతున్న సమయంలో అదుపు తప్పిందని, వేగం కంట్రోల్ కాకపోవడంతో రన్ వే చివరి వరకూ వెళ్ళి లోయలో పడిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ప్రమాదం వార్త తెలిసిన వెంటనే 20 అగ్నిమాపక శకటాలు, ఆంబులెన్సులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. విమానం లాండింగ్ అవుతున్న సమయంలో వర్షం కురుస్తూ ఉందని, సాధారణంగా విమానం క్రాష్ కాగానే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటుకుని మంటలు వస్తాయని, కానీ వర్షం కారణంగా మంటలు రాకుండా విమానం రెండు ముక్కలైందని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ కేరళ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమాన ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు.

విమాన ప్రమాదంలో మొత్తం 123 మందికి గాయాలయ్యాయని, ఇందులో సుమారు యాభై మంది తీవ్రంగా గాయపడినట్లు మలప్పురం ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులందరినీ కోళికోడ్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కాలికట్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ఐదుగురు, బేబీ మెమొరియల్ ఆసుపత్రిలో ఇద్దరు, కొండుట్టి ఆసుపత్రిలో ఇద్దరు, ఫెరోక్ ఆసుపత్రిలో ఒకరు చొప్పున మృతి చెందగా మిగిలినవారు సంఘటనా స్థలంలో మృతిచెందినట్లు జిల్లా అధికారులు తెలిపారు. సుమారు 45 మంది కోళికోడ్‌లోని ఎంఐఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలం నుంచి ఐదుగురి మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నెంబర్లను (1800 118 797; +91 11 23012113; +91 11 23014104; +91 11 23017905; ఫ్యాక్స్-+91 11 23018158) అందుబాటులోకి తెచ్చింది.

వర్షాలే ప్రమాదానికి కారణమా?

కోళికోడ్, ఇడుక్కి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ పరిశోధనా కేంద్రం రెండు రోజుల క్రితమే హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో రెండు రోజుల్లో 21 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. ప్రతికూల వాతావరణంలో లాండింగ్‌కు ప్రయత్నించడమే లోపమా లేక రన్ వే నిర్వహణలో లోపమా అనేది స్పష్టం కాకపోవడంతో విమాన ప్రమాద సంఘటనపై సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ విచారణకు ఆదేశించారు. ఢిల్లీలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, డీజీసీఏ, ఎయిర్ ఇండియా అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. కోళికోడ్ విమాన ప్రమాద సంఘటనపై సమీక్షించారు.

రన్‌వే నిర్వహణలో లోపం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ తర్వాతనే వివరాలు వెలుగులోకి వస్తాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కోళికోడ్ విమానాశ్రయంలో 2,860 మీటర్ల పొడవైన రన్‌వే ఉందని, బోయింగ్-737 రకం విమానం లాండ్ కావడానికి ఇది చాలా ఎక్కువని కేవలం 1289 మీటర్ల రన్‌వే సరిపోతుందని, కానీ లాండింగ్ సమయంలో విమానం వేగం అదుపులోకి రాకుండా ముందుకు దూసుకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భారత ఎయిర్ ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేసిన కెప్టెన్ డీవీ సాథేకు పైలట్‌గా అపారమైన అనుభవం ఉందని, గతంలో ప్రతిష్టాత్మకమైన స్వోర్డ్ ఫ్ హానర్ అందుకున్నారని ఆయనతో పనిచేసిన పైలట్లు వార్తా సంస్థకు వివరించారు.

గతంలో కోళికోడ్‌లో జరిగిన ప్రమాదాలు

– 2008 నవంబరు 7న ఇదే విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ 310 (ఏఐ-962) జెడ్డా, సౌదీ మీదుగా వచ్చి రన్ వే పై ప్రమాదానికి గురైంది.
– 2012 జూలై 9న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737-800 రన్ వే పై నుంచి జారి పడింది. అప్పుడు కూడా భారీ వర్షమే ఉంది. మృతిచెందకపోయినప్పటికీ విమానం మాత్రం ముక్కలైంది.
– 2017 ఏప్రిల్ 25న ఎయిర్ ఇండియా !-321-200 ఇంజన్ ఫెయిల్ కారణంగా టేకాఫ్ సమయంలో టైర్ పేలిపోయింది.
– 2017 ఆగస్టు 4న స్పైస్ జెడ్ విమానం కూడా రన్ వే పై నుంచి జారింది.

ప్రయాణీకులంతా పొట్ట కూటి కోసం వెళ్ళినవారే

ఉపాధి కోసం దుబాయ్ బాటపట్టినవారంతా ‘వందే భారత్’ పథకంలో భాగంగా సొంతూళ్ళకు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణమయ్యారు. వీరంతా పేదలే. కేరళ రాష్ట్రానికి చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు. ముగ్గురు తమిళనాడుకు చెందినవారుకాగా ఒకరు తెలంగాణకు చెందినవారు. మరో 16 మంది ఎక్కడివారో తెలియదు. కరోనా కష్టకాలంలో పరాయి నేలమీద అనేక ఇబ్బందులు పడి, కుటుంబ సభ్యులను ఆందోళనలో పెట్టి మరికొన్ని నిమిషాల్లో స్వదేశంలో దిగుతున్నామని అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఊహించని విధంగా ప్రమాదానికి గురికావడం, 15 మంది చనిపోయి సుమారు 50 మందికిపైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరడం దురదృష్టకరం. పొట్టకూటి కోసం ఇంతకాలం పరాయి దేశంలో రెక్కలు ముక్కలు చేసుకుని బతికి ఇప్పుడు బతికుంటే బలుసాకు అని భావించి తిరుగు ప్రయాణమయ్యారు. మరికొన్ని క్షణాల్లో స్వంత నేలను ముద్దాడే సమయంలో రన్ వే పై ఏం జరుగుతుందో తెరియక క్షణాల్లోనే పదిహేను మంది తిరిగిరాని లోకాలకువెళ్ళిపోయారు. విధి వైపరీత్యం వారి సంతోషాన్ని పటాపంచలు చేసింది.

Advertisement

Next Story