సచివాలయంలో కొత్తగా 14 మందికి పాజిటివ్

by vinod kumar |
సచివాలయంలో కొత్తగా 14 మందికి పాజిటివ్
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్‌ వైరస్ కారణంగా పలువురు ఉద్యోగులు ఆసుపత్రిలో చేరుతూ ఉంటే వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న ఉద్యోగులు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్క డిపార్టుమెంటులో పాజిటివ్ కేసు నిర్ధారణ కావడంతో మొత్తం బ్లాకునే శానిటైజ్ చేసి వారం రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు వెళ్తున్నాయి. సచివాలయంలో ఇప్పటికే ఆరుగురు ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో 7, 8 అంతస్తుల్లో ఉన్న ఆర్థిక శాఖ కార్యాలయానికి తాళం పడింది. ఇప్పుడు మూడో అంతస్తులో ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖలో ముగ్గురికి, ఐదో అంతస్తులో ఉన్న వైద్యారోగ్య శాఖలో 10 మందికి పాజిటివ్ రావడంతో ఈ రెండు అంతస్తులూ మూతపడ్డాయి. కోఠిలోని ప్రజారోగ్య వాఖ డైరెక్టర్ కార్యాలయంలోని రెండో అంతస్తులో ఉన్న ఎంటెమాలజీ విభాగంలోని ఒక ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని ఒక ఉద్యోగి కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతూ మరణించినట్టు ఆ శాఖతో సంబంధం ఉన్న వ్యక్తి ఒకరు కేటీఆర్‌కు ట్వీట్ ద్వారా తెలియజేశారు.

వివిధ ప్రాంతాలు, వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు వైరస్ సోకుతుండడంతో రోజువారీ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. ఉద్యోగులంతా టెన్షన్‌తో పనిచేయాల్సి వస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత వందశాతం ఉద్యోగులు విధులకు హాజరుకావాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ అయినా మూడవ వంతు మంది కూడా హాజరుకావడంలేదు. ఒక్కరికి పాజిటివ్ రావడంతో మొత్తం కార్యాలయమే మూతపడుతోంది. ఉద్యోగులంతా ఇండ్ల నుంచే పనిచేయాల్సి వస్తోంది. కొవిడ్ నిబంధనలను పాటించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ కావడం, వాటిని పకడ్బందీగా అమలుచేస్తున్నామంటూ ఆయా శాఖల పెద్దలు ప్రభుత్వానికి భరోసా ఇస్తున్నా ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తూనే ఉంది.

సచివాలయంలోని ఐదో అంతస్తులో ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయనతో కాంటాక్టులోకి వెళ్ళిన ఒక డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక్కడితో ఆగకుండా ఆ శాఖలో మొత్తం 10 మందికి కరోనా సోకినట్టు శుక్రవారం సాయంత్రం రిపోర్టుల ద్వారా స్పష్టమైంది. ఏ నుంచి ఐ సెక్షన్ల వరకు ఉద్యోగులందరినీ ఇళ్ళకు పంపించిన ఉన్నతాధికారులు రెండ్రోజుల పాటు శానిటైజ్ పేరుతో ఆఫీసుకు తాళం వేస్తున్నారు. వారం పది రోజుల వరకూ ఉద్యోగులు ఆఫీసుకు రావద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులు ఆఘమేఘాల మీద కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని ఒక ఉద్యోగి కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందాడని, ఐదారుగురు ఉద్యోగులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఎంత మందికి పాజిటివ్ సోకిందో అర్థం కాని గందరగోళ పరిస్థితి నెలకొనిందని, అందువల్ల సుమారు 400 మంది ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతకాలం ఆఫీసును మూసివేయాలని కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి వెళ్ళింది.

ఏ రోజు ఏ ఆఫీసు మూతపడుతుందో, ఎంత మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలుతుందోననే ఆందోళనతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు. రెండు వారాల క్రితం ఆర్థిక శాఖలో పనిచేసే ఉద్యోగులకు పాజిటివ్ రావడం, దాని కొనసాగింపుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న అధికారికి పాజిటివ్ రావడంతో ఇప్పుడు ఆ బ్లాక్‌లోని ఉద్యోగులంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సైతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed