వరదలతో ఆ శాఖలకు రూ.1375 కోట్ల నష్టం

by Anukaran |   ( Updated:2020-10-17 11:19:27.0  )
వరదలతో ఆ శాఖలకు రూ.1375 కోట్ల నష్టం
X

దిశ, ఏపీ బ్యూరో: బంగాళాఖాతంలో వాయు గుండం రైతుల్ని నిండా ముంచేసింది. ఎనిమిది రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు అతలాకుతలం చేశాయి. రైతుల కష్టార్జితాన్ని వరద నేలపాల్జేసింది. లక్షా 8 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 40 వేల హెక్టార్లలో గింజ పోసుకుంటున్న దశలో వరి నేలకొరిగింది. మరో 7,745 హెక్టార్లలో మిగతా పంటలకు నష్టం వాటిల్లింది.

వరదల వల్ల రహదారులు, భవనాల శాఖకు రూ.1,288.96 కోట్లు, జలవనరుల శాఖకు రూ.31.50 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.16.13 కోట్లు, ఇంధన శాఖకు రూ. 0.20 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.38.08 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.0.45 కోట్లు కలిపి మొత్తం రూ.1,375.32 కోట్ల మేర నష్టం జరిగింది. భారీ వర్షాలు, వరదలు 171 మండలాల్లో ప్రభావం చూపాయి.

902 గ్రామాల్లోకి వరద చుట్టుముట్టింది. 28,927 ఇళ్లు నీట మునిగాయి.1336 ఇళ్లు కూలిపోయాయి.14 మంది చనిపోయారు. ప్రభుత్వం 123 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలకు చెందిన 7,853 కుటుంబాలను తరలించింది. 32,823 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయం కల్పించింది.
Advertisement

Next Story

Most Viewed