24 గంటల్లో 1,334 కేసులు.. మొత్తం 15,712 : కేంద్రం

by vinod kumar |
24 గంటల్లో 1,334 కేసులు.. మొత్తం 15,712 : కేంద్రం
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 1,334 కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. 27 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కాగా, ఆదివారం సాయంత్రానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,116కు పెరగ్గా.. మరణాల సంఖ్య 519కి చేరింది. 2,302 మంది కోలుకున్నారు. గడిచిన 28 రోజుల్లో పుదుచ్చేరిలోని మాహె, కర్ణాటకలోని కొడగులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అగర్వాల్ వెల్లడించారు. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 14 రోజుల నుంచి ఒక్క కేసుకూడా రిపోర్ట్ కాలేదని వివరించారు. దేశవ్యాప్తంగా 755 ప్రత్యేక కొవిడ్ 19 ఆస్పత్రులున్నాయని, 1,389 ప్రత్యేక హెల్త్ కేర్ సెంటర్స్‌లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

రేపటి నుంచి మినహాయింపులు:

కంటైన్‌మెంట్ జోన్‌లు లేని ఏరియాల్లో కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ మినహాయింపులు 20వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని అగర్వాల్ తెలిపారు. కానీ, కంటైన్‌మెంట్ జోన్‌లలో ఈ సడలింపులుండబోవని స్పష్టం చేశారు. అంతేకాదు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు ఈ సడలింపులను అమలు చేయడం వాటి అభీష్టానికే వదిలేసినట్టు తెలిపారు. ఒకవేళ పరిస్థితులను బట్టి కేంద్ర నిబంధనల కంటే ఇంకా కఠిన కండీషన్స్‌ను అమలు చేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని వివరించారు.

TAGS: coronavirus, health ministry, lav agarwal, cases, fatalities, relaxation

Advertisement

Next Story