11 ఏళ్ల చిన్నారి చొరవ.. బడిబాట పట్టిన 100 మంది

by Sujitha Rachapalli |
11 ఏళ్ల చిన్నారి చొరవ.. బడిబాట పట్టిన 100 మంది
X

దిశ, ఫీచర్స్ : జార్ఖండ్‌‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి దీపికా మిన్జ్ తమ చండపర గ్రామంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తుంది. 11 ఏళ్ల గిరిజన అమ్మాయి తమ జూనియర్లు పాఠశాలల్లో ఇప్పటికే నేర్చుకున్న అధ్యాయాలను మరచిపోకుండా ఉండటానికి ఉచితంగా పాఠాలు బోధిస్తోంది. అంతేకాదు సీనియర్ విద్యార్థులకు క్లాసులు ఏర్పాటు చేసేలా గ్రామసభను ఇన్‌స్పైర్ చేసింది.

చండపరలోని గ్రామసభ వేదికగా 100 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడటంతో పిల్లలంతా తాము చదువుకున్న పాఠాలన్నీ మరచిపోయారు. కానీ దీపికా చొరవతో ఇప్పుడు వివిధ వయసుల వారికి బ్యాచ్‌ల వారిగా తరగతులు నిర్వహిస్తున్నారు. దీపిక తనకంటే చిన్న తరగతుల వారికి పాఠాలు బోధిస్తుంటే 12వ తరగతి చదువుతున్న మధు మిన్జ్, గ్రాడ్యుయేషన్ చదువుతున్న లిల్లీ హైయ్యర్ విద్యార్థులకు స్వచ్ఛందంగా పాఠాలు నేర్పిస్తున్నారు. దీపిక మొదటి బ్యాచ్‌లో తన జూనియర్లకు ఇంగ్లీష్, గణిత పాఠాలు బోధించి, షెడ్యూల్ ప్రకారం తన తరగతులకు హాజరవుతుంది.

‘లాక్‌డౌన్ కారణంగా గ్రామంలోని పాఠశాలను మూసివేయడంతో.. పిల్లలు రోజంతా ఆడుకోవడంతోనే సరిపెట్టుకునేవాళ్లు. దాంతో ఇదివరకు పాఠశాలల్లో బోధించిన పాఠాలను మరచిపోవడం సహజం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా ఇంటి పొరుగున నివసిస్తున్న ఇద్దరు పిల్లలను ఆహ్వానించి గత తరగతుల్లో నేర్చుకున్న పాఠాలను వారికి బోధించడం ప్రారంభించాను. ఆశ్చర్యకరంగా ఇది గమనించిన ఇతర పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను నా దగ్గరకు పంపడం మొదలుపెట్టారు. దాంతో పిల్లల సంఖ్య 20కి చేరింది. పిల్లల సంఖ్య మరింత పెరిగేకొద్దీ, నా స్నేహితురాలు స్నేహను కూడా పాఠాలు బోధించమని అడిగాను. అప్పటివరకు ఇంటి ప్రాంగణంలోనే బోధించిన నేను.. గ్రామసభ వేదికకు మార్చాను. అక్కడ మేమంతా చదువుకోవడం చూసిన గ్రామసభ పెద్దలు నన్ను సభకు పిలిచారు. పై తరగతుల విద్యార్థులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారికి కూడా పాఠాలు బోధిస్తే ఉపయోగకరంగా ఉంటుందని గ్రామపెద్దలకు వివరించాను. దాంతో వారికికూడా క్లాసులు చెప్పాలని నిర్ణయించారు’

– దీపిక

‘మేము ఉపాధ్యాయులకు స్టడీ మెటీరీయల్స్ అందిస్తున్నాం. వాళ్లంతా వారి సౌలభ్యం ప్రకారం విద్యార్థులకు ఉచితంగా బోధిస్తారు. వెనుకబడిన ప్రాంతం కావడంతో, ఆన్‌లైన్ తరగతులు ఇక్కడ సాధ్యం కాదు. కానీ దీపిక చేసిన పని నిజంగా గ్రామంలోని అందర్నీ కదలిచింది. ప్రస్తుతం ఆ చిన్నారి వల్లే 100మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ నిస్సహాయంగా మారిన సంక్షోభ సమయంలో తల్లిదండ్రులలో ఆశా కిరణాన్ని తెచ్చిపెట్టినందుకు దీపికను చూసి గర్వపడుతున్నాం

– గ్రామపెద్దలు

ఐఎఎస్ ఆఫీసర్ కావాలన్నది దీపిక ఆశయం. ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్న ఆ చిన్నారి ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం.

Advertisement

Next Story

Most Viewed