పదేళ్ల బాలుడు.. రూ. 71 లక్షల విరాళం

by Anukaran |   ( Updated:2020-10-21 03:38:15.0  )
పదేళ్ల బాలుడు.. రూ. 71 లక్షల విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: యూకేకు చెందిన ఓ పదేళ్ల పిల్లోడు 200 రోజుల నుంచి టెంట్‌ కిందే జీవనం సాగిస్తున్నాడు. అంతేకాదు అందులో ఉంటూనే రూ. 71 లక్షల వరకు సంపాదించాడు. అసలు ఆ పిల్లోడు టెంట్‌లో ఎందుకు ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడు? వచ్చిన డబ్బును ఏం చేశాడు?

యూకేకు చెందిన పదేళ్ల మ్యాక్స్ వూసీ, తన ఇంటి పక్కన ఉండే 74 ఏళ్ల రిక్‌ మంచి ఫ్రెండ్స్‌. అయితే రిక్‌కు కేన్సర్ రావడంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇటీవలే కన్నుమూశాడు. ఆయన మరణంతో మ్యాక్స్ చాలా బాధపడ్డాడు. కానీ అంతలోనే తేరుకున్న మ్యాక్స్.. ఏడిస్తే లాభం లేదని, రిక్ కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడే రిక్ తాను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు మ్యాక్స్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన టెంట్‌ గుర్తుకొచ్చింది. ఆ టైమ్‌లో దీన్ని అడ్వెంచర్ కోసం వినియోగించు’ అని కూడా చెప్పాడు రిక్. ఈ నేపథ్యంలోనే ఆ టెంట్‌ను తన ఇంటి ముందర వేసుకున్న మ్యాక్స్.. కేన్సర్ పేషెంట్లకు విరాళాలు సేకరించాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం 200 రోజుల నుంచి టెంట్‌లోనే నివాసం ఉంటున్నాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న చాలా మంది తనకు విరాళాలు అందిస్తున్నారు. అలా ఇప్పటికే 75 వేల పౌండ్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.71 లక్షలు) సంపాదించిన మ్యాక్స్.. ఆ మొత్తాన్ని రిక్ క్యాన్సర్‌కు వైద్యం చేసిన ‘నార్త్ డెవాన్ హాస్పిటల్‌’కు విరాళంగా అందజేశాడు.

‘నా స్నేహితుడు రిక్‌ను బతికించడానికి వైద్యులు ఎంతో శ్రమించారు. రిక్ తన చివరి రోజుల్ని హాస్పిటల్‌లోనే గడిపాడు. నా స్నేహితుడిలా క్యాన్సర్‌తో బాధపడేవారికి అవసరమైన మందులు, సేవల కోసం ఆ డబ్బుని హాస్పిటల్‌కు ఇచ్చాను. మరో ఏడాది పాటు ఇదే టెంట్‌లో జీవనం సాగిస్తాను. ఇందులో ఉంటే.. నా ఫ్రెండ్ రిక్‌తో ఉన్నట్లే ఉంటుంది’ అని మ్యాక్స్ తెలిపాడు

ఇక పదేళ్ల వయసులో.. తన స్నేహితుడి గుర్తుగా మ్యాక్స్ చేస్తున్న పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు. తన వయసుకు మించి గొప్ప మనసుతో చేస్తున్న పని నిజంగా ఎందరికో స్ఫూర్తినిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed