ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి చెక్కులు అందజేత

by srinivas |
ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి చెక్కులు అందజేత
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఆర్.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్‌ లీక్ అయి 12 మంది ప్రాణాలు కోల్పోగా, 411 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్ పేరిట నిధులను కూడా విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో మృతి చెందిన వారిలో కొందరి కుటుంబాలకు నష్ట పరిహారాన్ని ఏపీ మంత్రులు అందజేశారు.

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, బొత్స సత్యనారాయణ పరామర్శించిన సందర్భంగా, ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. వారసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్లు సిద్ధం కానందున మిగిలిన నలుగురికి తర్వాత అందజేస్తామని మంత్రులు ప్రకటించారు.

అనంతరం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలను వారి గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏపీలో పారిశ్రామిక ప్రాంతాల వద్ద భద్రతకు సంబంధించిన ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. సీఎం జగన్‌ చేసిన సూచనల మేరకు ఏపీ మంత్రులు ఈ రోజు రాత్రి ఒక్కొక్కరు ఒక్కో గ్రామంలో బస చేస్తామని ఆయన ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed