ఇల్లు పీకి పందిరి వేశారు.. అంతా ‘డబుల్’ మాయ..

by Anukaran |   ( Updated:2021-08-22 11:51:16.0  )
ఇల్లు పీకి పందిరి వేశారు.. అంతా ‘డబుల్’ మాయ..
X

దిశ, ఆదిలాబాద్ : ఇల్లు పీకి పందిరి వేశారు.. అన్న సామెత పెద్దలు చెప్పినట్లు ఎప్పుడో చిన్నతనంలో విన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇది నిజం.. పైన చిత్రంలో కనిపిస్తున్నది ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలం జరి గ్రామపంచాయతీ పరిధిలోని రాముల పల్లె గ్రామం. ఇక్కడ 30కి పైగా కుటుంబాలు నివాసం ఉంటాయి. ఈ గ్రామానికి ప్రభుత్వం 25 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేశారు. ఇల్లు ఖాళీ చేస్తే ఆ స్థలాల్లోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో గిరిజనులు ఇళ్లను పీకేసి పందిరిలో వేసుకొని నివాసముంటున్నారు. అయితే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు గిట్టుబాటు కాక బేస్మెంట్ లెవెల్ లోనే పనులు నిలిపి వేయగా.. ఏడాది కాలంగా గుడిసెలోనే పిల్లాపాపలతో కాలం వెళ్లదీస్తున్నారు.

వివిధ దశలోనే పనులు..

జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 3,862 ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో 3,098 ఇళ్లకు టెండర్లు పూర్తి అయ్యాయి. వాటిలో కేవలం 1,859 ఇళ్ళకు మాత్రమే కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. 518 ఇల్లు పూర్తి కాగా… మిగతా వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పునాది దశలో 15, పిల్లర్ల దశలో 199 ఇల్లు.. పైకప్పు వరకు 130, గోడల వరకు 60 నిర్మాణం పూర్తి అయ్యాయి. మిగిలిన 1,005 ఇళ్లలో ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా చోట్ల కాంట్రాక్టర్లు బిల్లులు రాక.. మధ్యలోనే ఇళ్ల నిర్మాణాలను వేశారు.

కలగానే డబుల్ బెడ్ రూములు…

జిల్లా వ్యాప్తంగా 3,098 ఇళ్లకు టెండర్లు పూర్తి కాగా.. కేవలం 1,859 ఇండ్లకు కాంట్రాక్టర్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణ సామాగ్రిలో ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చిన కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. నిర్మాణ వ్యయం భారంగా మారడం.. స్టీలు, సిమెంటు, కూలీల కొరత కాంట్రాక్టర్లపై నిర్మాణ భారం అధికంగా పడుతుంది. ఇలా చాలా చోట్ల పనులు ఆగిపోయాయి. దీంతో కాంట్రాక్టర్లపై ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తీసుకు వచ్చిన ఫలితం లేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటివరకు 518 ఇల్లు పూర్తయ్యాయి. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్‌కే కాలనీలో 760 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.

మావల లో 30 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ లబ్ధిదారులకు ఇంకా ఇవ్వలేదు. తలమడుగు మండలంలోని రొయ్యడి గ్రామానికి 25 ఇళ్లు మంజూరు అయినా పనులు మధ్యలోనే వదిలేశారు. బోథ్ మండలం కౌట గ్రామానికి 17 ఇల్లు మంజూరు చేయగా, నిర్మాణ పనులు పూర్తి కాక ఆగిపోయాయి. ఇలా జిల్లాలో అనేక చోట్ల పనులు వివిధ దశల్లో ఆగిపోయాయి. దీంతో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కలగానే మిగిలిపోయాయి. ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed