పదేళ్లు పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

by srinivas |
ysrcp 11years
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్సార్‌ ఆశయ సాధనే లక్ష్యంగా పుట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ పదేళ్లు పూర్తి చేసుకుని పదకొండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన తర్వాత అనేక పోరాటాలు, దీక్షలు చేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలకు పోటీ చేసి, 17చోట్ల విజయం సాధించారు. 2012 మే 25న అక్రమాస్తుల అభియోగంపై సీఎం జగన్ అరెస్ట్ అయ్యారు. 16 నెలల పాటు చంచల్ గూడ జైలులో ఉన్న ఆయన 2013 సెప్టెంబరు 23న బెయిల్ పై విడుదలయ్యారు.

అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీని సీఎం జగన్ ఓ బలమైన శక్తిగా మార్చారు. నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కూతవేటు దూరంలో అధికారానికి దూరమయ్యారు. 44.47 శాతం ఓట్లతో 67 సీట్లు, 8 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా వైసీపీ నిలబడింది. అధికారమే లక్ష్యంగా జగన్ తన రాజకీయ చతురతకు పదునుపెట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశారు. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారిలో కొంతమందికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి పదవులను సైతం కట్టబెట్టారు. వైసీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేర్చుకోవడాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఖండించారు. వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో పోరాడారు.

న్యాయం జరగకపోవడంతో ప్రజా కోర్టులో తేల్చుకునేందుకు జగన్ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేశారు. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ఇడుపులపాయలో 2017 నవంబరు 6న ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు.14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి వెళ్లారు. తమ మేనిఫెస్టో ఖురాన్‌.. బైబిల్‌.. భగవద్గీత.. అని జగన్ పదేపదే చెప్తూ ప్రజల్లో విశ్వసనీయపొందారు. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 సీట్లలో ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపుగా 70 శాతం హామీలను మెుదటి ఏడాదిలోనే అమలు చేసి రికార్డు సృష్టించారు.

విద్య, వైద్యం, వ్యవసాయం, పాలనలో పారదర్శకత, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి.. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందిస్తున్నారు. అలాగే ప్రతి నెలా 1వ తేదీ ఉదయాన్నే అవ్వాతాతలు, ఇతరులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత సిబ్బందిని నియమించారు. వలంటీర్లతో కలుపుకుని ఏకంగా 4 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మెుత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీని ..ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed