- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం గడ్డపై ‘షర్మిల’ శంఖారావం..
వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన ఆమె ఈ నెల 21న పోడు రైతులు, వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావానంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించారు. ప్రస్తుతం కొత్త పార్టీ పెడుతున్న షర్మిల వైఎస్సార్ చరిష్మా, వైఎస్సార్ సీపీ ఓటు బ్యాంకు ఉన్న ఖమ్మం జిల్లా పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.
దిశ ప్రతినిధి, ఖమ్మం : రాష్ట్రంలో కొత్త పార్టీ పురుడుపోసుకుంటున్న తరుణంలో ఉమ్మడి జిల్లావ్యాపంగా ఉన్న నేతలపై టీఆర్ఎస్ అధిష్ఠానం ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. అటు షర్మిల టీం కూడా మొదట దృష్టి పెట్టేది ఖమ్మం మీదే అనే టాక్ రావడంతో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై కూడా ఆచితూచి అడుగులేస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు గతంలో వైఎస్ఆర్ సీపీ నుంచి టీఆర్ఎస్ గూటికి చేరినవారే కావడంతో గులాబీ పార్టీలో గుబులు పట్టుకుంది.
రెండు సార్లూ ఊహించని ఫలితాలే..
స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన తర్వాత 2014 ఎన్నికల్లో రాష్ట్రం అంతటా టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఖమ్మం జిల్లాలో మాత్రం వైఎస్ఆర్ సెంటిమెంట్ తో వచ్చి వైసీపీకి ఊహించని విధంగా జిల్లా ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక ఎంపీ సీటు, మూడు ఎమ్మెల్యే సీట్లను కట్టబెట్టారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలవగా వైరా, అశ్వారావుపేట, పినపాక స్థానాలు వైఎస్ఆర్ సీపీ గెలుచుకుంది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రెండోసారి అధికారం కోసం ముందస్తుగా 2018లోనే ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ కు అన్ని జిల్లాలు గొప్ప మెజార్టీని కట్టబెట్టగా ఖమ్మం మాత్రం అనూహ్య ఫలితాలను అందించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పదిస్థానాల్లో కేవలం ఖమ్మం స్థానం ఒక్కటే టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో షర్మిల పార్టీ ఏమేరకు ప్రభావం చూపుతుందోననే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
‘పొంగులేటి’ సొంతగూటికి చేరానా?
‘ఎప్పటికైనా ఏ గూటి పక్షి ఆగూటికి చేరాల్సిందేనంటూ..’ ఇటీవల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కొందరు షర్మిల పార్టీతో ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీకి సంబంధించి మొదట పొంగులేటి శ్రీనివాసరెడ్డినే సంప్రదించినట్లు తెలిసింది. తనకు మద్దతు పలకాలని కోరినట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ అధిష్ఠానం మీద అంసతృప్తితో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. జాతీయ స్థాయి బీజేపీ నేతలు కూడా ఆయన్ను లాగేందుకు ప్రయత్నించారు. యువనేత కేటీఆర్ బుజ్జగించడం, హామీ ఇవ్వడంతో శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల షర్మిల ఫోన్ చేయగా.. పొంగులేటి స్పందించలేదని ఆయన సన్నిహితులు కొందరు అంటుంటే కేటీఆర్ పై నమ్మకంతో టీఆర్ఎస్ లోనే కొనసాగుతారని మరికొందరు చెబుతున్నారు.
ఇంటెలిజెన్స్ ఆరా..
అన్ని జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్న షర్మిల గురువారం కొంతమంది ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. ఎవరెవరు హాజరయ్యారనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సమావేశంలో పెద్దస్థాయి ముఖ్యనేతలు ఎవరూ లేనప్పటికీ ద్వితీయ శ్రేణి హాజరైనట్లు తెలుస్తోంది.
ఆదివాసీలతో భేటీ..
ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేసిన షర్మిల ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వైఎస్సార్ అభిమానులతో పాటు గిరిజనులతో షర్మిల సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 21న ఉదయం లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా షర్మిల ఖమ్మం రానున్నారు. రాష్ట్రంలో పోడుపోరు ఉధృతమవుతున్న తరుణంలో అదే అంశం అజెండాగా సమ్మేళనం నిర్వహించనున్నారు.
వలసలు తప్పవంటున్న రాజకీయవర్గాలు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారు. ఆయన ఇమేజ్ తో వచ్చిన జగన్ పార్టీ వైసీపీని కూడా జిల్లాలో ప్రజలు ఆదరించారు. ఇప్పుడు షర్మిల పార్టీని కూడా ఆదరిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటి వరకు పలు పార్టీల్లో ఉంటూ ఏ ప్రాధాన్యత లేని వారు టికెట్లు ఆశించి భంగపడ్డవారు. గ్రూపు రాజకీయాలతో తట్టుకోలేని కొందరు షర్మిల పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ కోసం ఆ దిశగా అడుగులు వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.