ఏపీలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం..ఊస్తే జైలే: జగన్

by srinivas |   ( Updated:2020-04-12 06:34:11.0  )
ఏపీలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం..ఊస్తే జైలే: జగన్
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్ని మరింత కట్టుదిట్టం చేశారు. కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాల్లోకి వెళ్తే..

కరోనా కట్టడికి ఇప్పుడు తీసుకుంటున్న చర్యలతో పాటు మరింత కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాలాజలం, జలుబు, దగ్గు, తుమ్ముల కారణంగా వెదజల్లే తుంపర్ల ద్వారా కరోనా విస్తరిస్తోందన్న పరిశోధకుల సూచనల ప్రకారం… బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. ఉమ్మివేయడం, పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై నిషేధం విధించింది. ఏపీలో ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు.

అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని 5.3 కోట్ల మందికి ఒక్కొక్కరికి మూడు చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు. వీటి వల్ల కరోనా వల్ల కొంత రక్షణ లభిస్తుందని తెలిపారు. మూడోసారి నిర్వహించిన సర్వేలో 32,249 మందిని ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వైద్యపరీక్షలకు రిఫర్ చేయగా, వారిలో 9,107 మందికి పరీక్షలు కచ్చితంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలుపగా, సీఎం 32 వేల మందికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 45 వేల పరీక్షలకు వైద్య శాఖ సిద్ధమవ్వాలని సీఎం జగన్ సూచించినట్టు తెలుస్తోంది.

అలాగే, కరోనా హైరిస్క్‌ ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. ఏపీలో వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు తరలించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
tags: jagan, corona virus, tadepalli, cm camp office, review meeting,
pic: jagan

Advertisement

Next Story