పాకిస్తాన్‌లో ‘జైహింద్’ అన్న ఫారినర్.. బ్యాన్ చేసిన భారత్

by Anukaran |   ( Updated:2021-07-13 02:15:10.0  )
YouTuber Karl Rock Blacklisted From India For One Year Visa Cancelled
X

దిశ, ఫీచర్స్ : పాకిస్తాన్‌లో ‘జైహింద్’ అని పలికి, అక్కడి చాయ్ కన్నా ఇక్కడి తేనీరు మధురమంటూ కొనియాడాడు. భారత్‌ను ఎప్పుడూ ట్రోల్ చేయనంటూ పాకిస్తానీయులతో ధైర్యంగా చెప్పాడు. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు ఆహారపు అలవాట్లను, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ.. అఖండ భారతంలోని అందమైన ప్రదేశాలను ఆకాశానికెత్తుతూ ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘హౌ టు ట్రావెల్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం కూడా రాసి హిందూస్థాన్‌పై తన ప్రేమను తెలపడమే కాదు, ఇతర దేశీయులు కూడా మన భూభాగాన్ని ఇష్టపడేందుకు కారణమయ్యాడు. ఈ క్రమంలో ఎన్నో స్కామ్‌ల గురించి ప్రజలకు సవివరంగా తెలియజేసిన ఆ విదేశీయుడు.. విచిత్రంగా ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్నాడు. అతడే న్యూజిల్యాండ్‌కు చెందిన కార్ల్‌ రైస్‌. 2017లో ‘కార్ల్ రాక్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్, సంస్కృతి సంప్రదాయాల గురించి వీడియోలు చేస్తున్న తనపై భారత ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇంతకీ అతని నేపథ్యమేంటి? ఎందుకు బ్యాన్ విధించారు? ఆ విశేషాలు తెలుసుకుందాం.

న్యూజిలాండ్‌కు చెందిన కార్ల్ రాక్ 2013లో తొలిసారి ఇండియాలో అడుగుపెట్టాడు. ఇక్కడి చరిత్ర, సంస్కృతి, ప్రజల ఆచార వ్యవహారాలు, ఆహారపు రుచులు తన మనసును కదిలించడంతో ఇండియాకు ఆకర్షితుడయ్యాడు. భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనుకున్నాడు. అప్పటి నుండి ఇండియాకు రావడం, కొత్త రాష్ట్రాన్ని అన్వేషించడం అతడికి ఇయర్లీ రితువల్‌గా మారింది. ఇక 2017లో తన కెరీర్, జీవితాన్ని వదిలిపెట్టి ఇక్కడికే వచ్చి ‘కార్ల్ రాక్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. తన అనుభవాల సారంగానే ఈ ఛానల్ రూపుదిద్దుకుంది. ఈ క్రమంలోనే భారతీయ ప్రజలతో కమ్యూనికేట్ కావడానికి హిందీ కూడా నేర్చుకున్నాడు. తన వీడియోల్లో భారతీయ కళలను, సంస్కృతిని ప్రశంసించాడు. మరికొన్ని వీడియోల్లో ఇక్కడ జరుగుతున్న మోసాల(గోల్డ్, కరోనా, వీసా స్కామ్స్)గురించి మాట్లాడాడు. విదేశీయులు ఇక్కడ నమ్మకంగా, సురక్షితంగా ప్రయాణించడంలో సహాయపడటానికి కొన్ని చిట్కాలను వారితో పంచుకుంటాడు. హిమవన్నగ అందాలు, కశ్మీరీ సోయగాలు, అండమాన్ నికోబర్ సాగర దృశ్యాలతోపాటు జమ్మూ, త్రిపుర, గుజరాత్ సహా ఇండియాలోని ప్రతి రాష్ట్రంలో, చిన్న చిన్న పట్టణాల్లో దొరికే ప్రత్యేక ఆహారాన్ని పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే 18 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్తో ముందుకు సాగుతున్నాడు.

నిషేధం అందుకేనా?

పాపులర్ యూట్యూబర్‌గా కొనసాగుతున్న కార్ల్ రాక్‌ను ఇండియాలో ఏడాది పాటు అడుగుపెట్టొదంటూ భారత ప్రభుత్వం అతడిపై నిషేధం విధించింది. అయితే గవర్నమెంట్ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో దీనిపై ఊహగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే 2019లో సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకే అతన్ని బ్లాక్ లిస్ట్ చేశారని నెటిజన్లు చర్చించారు. అయితే అతడు, తన భార్య సీఏఏలో పాల్గొన్న వీడియోను తన యూట్యూబ్ నుంచి తీసివేయడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. అలాగే 2020 అక్టోబర్‌లో పాకిస్థాన్‌లో పర్యటించిన కార్ల్ రాక్, పాక్‌ అక్రమిత కశ్మీర్‌తో పాటు సైనిక శిబిరాలను సందర్శించాడు. ముల్తాన్, పెషావర్‌లతో పాటు, బ్యాట్ ఫ్యాక్టరీకి వెళ్లాడు. అక్కడి స్ట్రీట్ ఫుడ్ పరిచయంతో పాటు ఉర్దూ కూడా నేర్చుకున్నాడు. అలా పాక్‌లో కొన్ని నెలలు గడిపాడనే కారణంతో అతడిపై నిషేధం విధించారని మరికొందరు వాదిస్తున్నారు. ఇక తన నిషేధంపై కార్ల్ రాక్ కూడా తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.

‘269 రోజుల నుంచి నా భార్యను చూడనివ్వడం లేదు. ఇండియాకు రావడానికి వీసా ఇవ్వడం లేదు. నిషేధం విధించినందుకు కనీసం కారణాలైనా చెప్పమని ఎన్ని మెయిల్స్‌ పెట్టినా రిప్లయ్ లేదు. నా భార్య ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా లాభం లేదని’ వీడియోలో తన బాధను వ్యక్తం చేశాడు. అయితే కార్ల్‌ రాక్‌ విషయంలో వినిపిస్తున్న వాదనలను, ఆరోపణలను కేంద్రం ఖండించింది. వీసా నిబంధనల, షరతులు ఉల్లంఘించిన నేరానికే అతన్ని బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టూరిస్ట్‌ వీసా మీద వచ్చిన అతను.. వ్యాపారాల్లో భాగం అయ్యాడని, ఇది వీసా కండిషన్స్‌ను ఉల్లంఘించడమే అవుతుందని, వచ్చే ఏడాది వరకు అతడిపై బ్యాన్ కొనసాగుతుందని తెలిపింది.

లవ్‌స్టోరీ..

2014లో ఢిల్లీని సందర్శించిన రాక్, మల్వియా నగర్‌లో కొంతమందితో కలిసి ఉన్నాడు. అందులో ఒకరి బర్త్ డే పార్టీ ఉండటంతో అక్కడికి వచ్చిన మనీషా డోర్ బెల్ కొట్టింది. తలుపు తీయగానే రాక్‌కు మనీషా కనిపించింది. తొలిచూపుల్లోనే ప్రేమలో పడిపోయాడు. కళ్లలో ఏదో ఫ్లాష్‌లైట్ మెరిసినట్లు, గుండెల్లో ఆర్కెస్ట్రా వాయించినట్లు అనిపించదట కార్ల్ రాక్‌కు. ఆరోజు ఆమెతో కాసేపు మాట్లాడినా అతడు మరింత తెలుసుకోవాలనుకున్నాడు. వీకెండ్‌లో ఆమె‌తో కలిసి ఔటింగ్‌కు వెళ్లాడు. ఇద్దరూ ఒకరి భావాలు మరొకరు పంచుకున్నారు. చిగురించిన స్నేహం, ప్రేమగా బలపడుతుందనేలోపే రాక్ న్యూజిలాండ్ వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వస్తాడో రాడో కూడా అతడికి స్పష్టంగా తెలియదు. ఏడాదికిపైగా మళ్లీ వాళ్లిద్దరూ కలుసుకోలేపోయారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌లో ఉద్యోగాన్ని వదిలి, ఇండియాలో ఓ ఏడాదిపాటు ఉండాలని నిశ్చయించుకున్నాడు. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పిచ్చిపని చేస్తున్నానని భావించారు. కానీ కార్ల్ రాక్ ఇండియాకు రాగానే మనీషాతో తన ప్రేమను వ్యక్తం చేశాడు. రెండేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2019లో పెళ్లి చేసుకున్నారు. మనీషా మాలిక్ ఒక ఫ్యాషన్ కంటెంట్ క్రియేటర్ కాగా వారి వ్లాగ్స్ ప్రకారం కార్ల్, మనీషాలు తమ వీడియోల్లో భారతీయ కళను, దాని సంస్కృతి గొప్పతనాన్ని వివరిస్తారు.

‘మనీషా హర్యానాలో జాట్ కుటుంబానికి చెందిన మహిళ. సంప్రదాయానికి విలువిచ్చే మనీషా.. తల్లిదండ్రులు మా వివాహాన్ని వ్యతిరేకించారు. అయితే ఇక్కడి కులం, ఆచారాలు తెలియని విదేశీయుడిని అయినప్పటికీ ఒకసారి నాతో మాట్లాడించేందుకు ఆమె వారిని ఒప్పించింది. ఆ సమయంలో నా హాస్టల్‌మేట్ ఆమె తల్లిదండ్రులను కలిసినప్పుడు పాదాలకు నమస్కరించమని సలహా ఇచ్చాడు. నేను అదేవిధంగా నమస్కరించడంతో వాళ్లు సంతోషపడ్డారు. మనీషా నాన్న నన్ను అనేక ప్రశ్నలు అడిగాడు. కుటుంబం, భవిష్యత్ ప్రణాళికలు, సంపాదన తదితర విషయాలపై చర్చించాం. అదృష్టవశాత్తూ, ఆమె తండ్రి నన్ను ఆమోదించారు. హర్యానాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన అతడు, తన సొంత వ్యాపారం ప్రారంభించడానికి ఢిల్లీకి వలసొచ్చాడు. నా కథ కూడా ఇంచుమించు అలాగే ఉండటంతో ఒప్పుకుని ఉంటాడు. రోహినిలోని మా ఇంట్లో మనీషా తల్లిదండ్రులతో కలిసి ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాం. ఆమె కుటుంబంతో కలిసి ఉండటం నాకు చాలా ఇష్టం. ఆమె తల్లిదండ్రులు కూడా ఇప్పుడు నా తల్లిదండ్రులు. ఇంట్లో అందరికీ స్వయంగా చాయ్ చేసివ్వడమంటే ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడం ఒక అందమైన అనుభూతి. భారతీయ జీవితాన్ని ఫాలోవర్స్‌తో పంచుకోవడం మరింత గొప్ప అనుభవం. – కర్ల్ రాక్

కార్ల్ రాక్, మరో యూట్యూబర్ జిమ్ బ్రౌనింగ్‌తో కలిసి బీబీసీ పనోరమా బృందంతో ఓ స్కామ్ బయటపెట్టారు. హర్యానాలోని గురుగ్రామ్‌ వేదికగా సైబర్ క్రైమ్ నేరస్థులు పలు దేశాల్లో స్కామ్స్ చేశారు. ఈ నేపథ్యంలో స్కామర్ కంప్యూటర్ల నుంచి 7వేల స్కామ్ కాల్ రికార్డింగ్ ఫైల్స్ డేటాను సేకరించారు. అంతేకాదు యునైటెడ్ కింగ్‌డమ్‌, యూఎస్, ఇండియాలోని వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న క్రైమ్‌ను డాక్యుమెంట్ చేసి, స్కామ్‌ను బ్రేక్ చేశారు. ఇక COVID-19 రోగులకు చికిత్స కోసం రెండు సార్లు ప్లాస్మాను దానం చేసి, ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ప్రశంసలు అందుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed