ఉప పోరులో ‘సైలెంట్’​పర్వం!

by Shyam |   ( Updated:2020-10-30 22:53:47.0  )
ఉప పోరులో ‘సైలెంట్’​పర్వం!
X

తుఫాన్​‌ వచ్చే ముందు ప్రశాంతత.., ఫలితాల ప్రకటనకు ముందు ఉత్కంఠ.. ఫైనల్​కు ముందు సెమీస్​లా ఎవరి అంచనాలు వారివి.. ఎవరి ఆశలు వారివి.. అన్ని పార్టీలదీ గెలుపు ధీమాయే.. అందరి బలాలు ఎదుటోరి బలహీనతలే.. దుబ్బాక పోరు రసవత్తరంగా మారింది.. నియోజకవర్గ చిత్రం విచిత్రంగా మారింది.. ఏజ్​ గ్రూపుల ఓట్ల లెక్కల్లో పార్టీ నేతలు తలమునకలయ్యారు.. సైలెంట్​ ఓటింగ్​పై హైరానాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉప పోరు చివరి అంకానికి చేరుతోంది. పార్టీలన్నీ అనుకూల ఓట్లపై ఆశలు పెట్టుకుంటున్నాయి. ప్రచారం ఆఖరి అంకానికి చేరడంతో ఓటర్ల లెక్కలేసుకుంటున్నాయి. ఇటీవలి పరిణామాలు కలిసొస్తాయని బీజేపీ భరోసాతో ఉంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులపై అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. ముత్యంరెడ్డి హయాంలోని అభివృద్ధి అక్కున చేర్చుకుంటుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో సైలెంట్ ఓటింగ్ కీలకంగా మారింది.

గత లెక్కలు..

దుబ్బాక నియోజకవర్గంలో యువత ఓట్లు ఇప్పుడు కీలకంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల జాబితాను పరిశీలిస్తే 18 నుంచి 24 ఏళ్ల లోపు 22,621 మంది ఓటర్లు, 25 నుంచి 34 లోపు 54,327 మంది, 35 నుంచి 44 వరకు 43,999, 45 నుంచి 54 వరకు 34,556 మంది, 55 నుంచి 64 ఏండ్ల వరకు 22,192 మంది ఓటర్లున్నారు. 65కు పైబడిన వారి ఓట్లు 20 వేలున్నాయి. మొత్తంగా 1,97,877 ఓట్లు ఉండగా, అందులో మహిళా ఓట్లే 94 వేలు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 89 వేలు (54.47 శాతం) ఓట్లు, కాంగ్రెస్‌కు 16.4 శాతం, బీజేపీకి 13.8 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఉప ఎన్నికల్లో 1,98,807 ఓట్లుండగా మహిళల ఓట్లు లక్షకు చేరాయి.

యువత మలుపు తిప్పేనా..?

అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లు 76 వేలు ఉండగా, ప్రస్తుతానికి 87 వేలకు చేరాయి. ఈ నేపథ్యంలో పోలయ్యే ఓట్లలో 90 శాతానికిపైగా వీరివే ఉంటాయని తేలింది. దీంతో యువత ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో వ్యతిరేకంగా ఉన్నట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో కూడా అదే వైఖరి వెల్లడైంది. ఉద్యోగాల భర్తీ లేకపోవడం, నిరుద్యోగ సమస్య పెరుగడంతో పాటుగా నిరుద్యోగ భృతి ఊసే లేదు. రీయింబర్స్​మెంట్​ నిధులపై ప్రభుత్వం దోబూచులాడుతోంది. దీంతో యువతకు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇది పలు సందర్భాల్లో వెల్లడైంది. ఈ ఓట్లన్నీ గంపుగుత్తగా వస్తాయన్న ఆశతో బీజేపీ ఉంది. ఇటీవల జరిగిన పరిణామాలు కూడా కలిసొస్తాయని భావిస్తోంది. మరోవైపు 45 ఏళ్లలోపు వారి ఓట్లు కూడా కీలకంగానే మారాయి. వీరి ఓట్లు కూడా బీజేపీకి లాభం చేకూర్చుతాయని భావిస్తున్నారు. 44 వేల ఓట్లుండగా వీరిలో ప్రైవేట్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వారంతా కరోనా కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి ప్రభుత్వం తరఫున అందిన సాయం తక్కువే. ఉద్యోగాలు పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీకి లాభం చేసేలా ఉన్నట్లు అంచనాల్లో ఉన్నారు.

సంక్షేమ ఆశలు..

టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ ఫలాలపైనే ఆశలు పెట్టుకుంది. పథకాల లబ్ధిదారులు ఏకతాటిపై ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. దాదాపు లక్ష మంది సంక్షేమ లబ్ధిదారులు ఉంటారని, వీరందరి ఓట్లు పడితే గెలుపు తథ్యమనే ఆశతో టీఆర్​ఎస్​ నాయకులు ఉన్నారు. కాగా, 2014, 2018 ఎన్నికల్లో రామలింగారెడ్డికి మెజార్టీ పెరిగింది. 2014లో రామలింగారెడ్డికి 82 వేల ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ముత్యంరెడ్డికి 44 వేల ఓట్లు వచ్చాయి. 2018లో రామలింగారెడ్డికి 89 వేల ఓట్లు రాగా కాంగ్రెస్‌కు అభ్యర్థికి 26 వేల ఓట్లు వచ్చాయి. ఈ రెండుసార్లు బీజేపీ నుంచి రఘునందనరావు బరిలో ఉన్నా 2014లో 15 వేల ఓట్లు, 2018లో 22 వేల ఓట్లు వచ్చాయి.

తాజా పరిస్థితి ఎవరికి అనుకూలం..?

తర్వాత జరిగిన పరిణామాలతో రామలింగారెడ్డిపై వ్యతిరేకత పెరిగింది. అభివృద్ధి పనుల్లో వెనకబడ్డారని, కార్యకర్తలు, నేతలను కలుపుకుని వెళ్లలేదనే ప్రచారం ఉంది. అయితే ఆయన మరణంతో ఆయన భార్యకు టికెట్ ఇచ్చిన అధికార పార్టీ సానుభూతి ఓట్ల కోసం కూడా గాలం వేసింది. కానీ ఆయన కుమారుడి వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి కూడా ఆయన కుమారుడిని తక్కువే తిప్పుతున్నారు. మొత్తం బాధ్యతను హరీష్‌రావు మీదేసుకున్నా పార్టీ నేతల్లో మాత్రం అసంతృప్తి ఉంది. ప్రతి పనికి హరీష్‌రావు దగ్గరకు వెళ్లడం కష్టమని, దుబ్బాక నియోజకవర్గంలో హరీష్‌రావు పెత్తనం సాగిస్తే ఇబ్బంది ఉంటుందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎలాంటి రాజకీయానుభవం లేని సుజాతకు మద్దతుగా ఉంటున్నా ముందు జరిగే పరిణామాలపై ఆందోళన చెందుతూనే ఉన్నారు.

ముత్యంరెడ్డిదే అభివృద్ధిగా కాంగ్రెస్..

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం విస్తృతంగా చేస్తోంది. పార్టీ శ్రేణులు మొత్తం అక్కడే మోహరించాయి. చెరుకు ముత్యంరెడ్డికి అన్యాయం చేశారని, ఆయన హయాంలోనే దుబ్బాక అభివృద్ధి జరిగిదంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. పాత తరం ఓట్లు తమకే కలిసివస్తాయని ఆశల్లో ఉన్నారు.

ఈ పరిణామాల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్‌పై పార్టీలన్నీ గుబులుగా ఉన్నాయి. 50 ఏండ్లకుపైబడిన వారంతా సైలెంట్ ఓటింగ్ జాబితాలో ఉంటారని భావిస్తున్నారు. ఈ లెక్కన వీరి ఓట్లు ఎవరికి లాభం చేకూర్చుతాయని అంచనాలు వేస్తున్నారు. అయితే దుబ్బాక ఫలితాలపై మాత్రం అన్ని వర్గాలు ఎదురుచూస్తున్నాయి. దుబ్బాక ప్రభావం వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఉంటుందనుకుంటున్నారు.

Advertisement

Next Story