వ్యాక్సిన్ ఇవ్వలేదు.. తిరిగి వెళ్తుండగా సడన్ మెస్సెజ్.. చూస్తే షాక్!

by Sridhar Babu |   ( Updated:2021-06-16 08:52:31.0  )
వ్యాక్సిన్ ఇవ్వలేదు.. తిరిగి వెళ్తుండగా సడన్ మెస్సెజ్.. చూస్తే షాక్!
X

దిశ, కరీంనగర్ సిటీ : మొన్న కోవాగ్జిన్‌కు బదులు కోవిషీల్డ్ టీకా, నిన్న రెండో డోస్ వేసుకున్న వ్యక్తికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేసినట్లు, ఈరోజు అసలు వ్యాక్సిన్ తీసుకోకుండానే మొదటి డోస్ విజయవంతంగా పూర్తి చేసినట్లు మెస్సేజ్‌లు పంపుతూ జిల్లా వైద్య శాఖ సిబ్బంది విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. పనిఒత్తిడా లేక అలవాటులో పోరపాటా.. పొరపాట్లు అలవాటుగా మారాయా తెలీదు కానీ, వైద్య సిబ్బంది నిర్వాకంతో ఇటు ప్రజలు, అటు అధికారులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని వైశ్య భవన్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా టీకా తీసుకునేందుకు నగరానికి చెందిన వేముల రాధిక అనే యువతి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకుంది.

బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య టీకా తీసుకునేందుకు స్లాట్ బుక్ అయింది. ఈ మేరకు మెసేజ్ కూడా వచ్చింది. దీంతో, టీకా కోసం వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళాక తాను తీసుకోదల్చుకున్న వ్యాక్సిన్ లేకపోవటంతో వెనుదిరిగింది. అయితే, ఆమె ఇంటికి చేరుకునేలోపే మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు, తన మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అది చూశాక ఒక్కసారిగా షాక్‌కు గురైన రాధిక తిరిగి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించగా, పొరపాటున మీ స్లాట్ భర్తీ చేసినట్లు సెలవిచ్చారట. ఇది వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి దర్పణం పడుతుండగా వారి తీరుతో తమకు సమస్యలు వస్తున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed