మీ మేధాశక్తి అద్భుతం… ప్లాస్టిక్ బాటిల్స్ తో ఇంటి నిర్మాణం

by Anukaran |   ( Updated:2021-06-16 09:04:37.0  )
మీ మేధాశక్తి అద్భుతం… ప్లాస్టిక్ బాటిల్స్ తో ఇంటి నిర్మాణం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఒక ఇంటికి, కార్యాలయానికి గోడలు నిర్మించాలంటే మట్టి, ఇటుకలు, రాళ్లు అవసరం అవుతాయి. కానీ పర్యావరణానికి ప్రమాదకరమైన ప్లాస్టిక్ బాటిల్స్ ని ఉపయోగించి గోడలు కట్టి అందమైన ఇంటిని నిర్మించాలంటే ఎవరికైనా కష్టమే. కానీ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం అప్పనపల్లి లో ఉన్న టచ్ సంస్థ నిర్వాహకులు ఈ విషయాన్ని నిజం చేస్తూ అందమైన ఇంటిని నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే టచ్ సంస్థ నిర్వాహకులు గత 16 సంవత్సరాలుగా అనాధ పిల్లలను చేరదీసి వారికి విద్యా బుద్ధులు నేర్పుతూ ముందుకు సాగుతున్నారు.

అందుకు దాతలు కూడా సహకరిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో సంస్థను నిర్వహించారు. ఇటీవల దాతల సహకారంతో అప్పన్నపల్లి లో స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ సంస్థ కార్యాలయాన్ని నిర్మించేందుకు దాతల సహకారాన్ని కోరే సందర్భంలో ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత అయిన నాగ్ అశ్విన్ సలహాలు సూచనలతో స్ప్రైట్, థమ్సప్, తదితర శీతలపానీయాల ప్లాస్టిక్ బాటిల్స్ లను ఉపయోగించి తక్కువ ఖర్చుతో సంస్థ కార్యాలయాన్ని నిర్మించవచ్చు అని సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలతో టచ్ సంస్థ నిర్వాహకులు బాటిల్స్ ను ఉపయోగించి గోడలు కట్టారు. అనంతరం మిగతా ఇళ్లుకు కప్పులు వేసినట్లు గా ప్లాస్టిక్ రేకులతో అందంగా తీర్చిదిద్దారు.

ఇలా కట్టారు

ఇంటి నిర్మాణానికి అవసరమైన దాదాపుగా ఆరు వేల ప్లాస్టిక్ బాటిల్స్ ను నాగ అశ్విన్ తన సొంత ఖర్చులతో సేకరింప చేసి సంస్థ నిర్వాహకులకు పంపారు. బాటిల్స్ లో ఇసుక, డస్ట్ నింపి ఇటుకలకు బదులుగా గోడల్లో పేర్చారు. అనంతరం సినిమా సెట్టింగులను తలపించేలా వాటికి డిజైన్లు చేశారు. తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో ఇంటిని నిర్మించారు. ఇందులో ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ హాల్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ విధమైన ఇల్లు నిర్మించాలంటే పదిహేను లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచన. ప్లాస్టిక్ బాటిల్స్ తో నిర్మించడం వల్ల ఆరు లక్షల రూపాయల మేర ఆదా కావడంతోపాటు, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బాటిల్స్ ను ఉపయోగంలోకి తెచ్చినట్లు అవుతున్నదని టచ్ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed