- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరిహద్దు సైనికులతో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారత జవాన్ల ధైర్య సాహసాలు హిమాలయాలను మించినవని, మాతృభూమి పట్ల సైనికుల అంకితభావం అసమానమని ప్రధాని మోడీ ఆర్మీని కీర్తించారు. సైనికులు చూపించిన ధైర్యసాహసాలు భారత ధీరత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయని పొగిడారు. దేశంలోని, ప్రపంచ నలుమూలల్లోని భారతీయులు సైనికులపై విశ్వాసముంచారని, భారత ఆర్మీ దేశాన్ని కాపాడుతుందన్న పూర్తి భరోసాతో ఉన్నారని అన్నారు. శత్రువులు భారత సైనికుల్లోని కోపాగ్నిని చవిచూశారని జూన్ 15న ఘటనను ఆయన లడాఖ్‌లో సైనికులనుద్దేశిస్తూ పరోక్షంగా ప్రస్తావించారు. ఆ హింసాత్మక ఘటనలో పాల్గొన్న వీర సైనికులను పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ లడాఖ్‌కు ఆకస్మిక పర్యటన చేశారు. అక్కడి నుంచి లేహ్‌లోని 11వేల అడుగుల ఎత్తులోని నిమూకు చాపర్‌లో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణెతో కలిసి వెళ్లారు. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దులో పరిస్థితులను ఆయన పర్యవేక్షించారు. ఆర్మీ, వైమానిక దళం, ఐటీబీపీ దళాలతో సంభాషించారు. మే నెల నుంచి సరిహద్దులో చోటుచేసుకుంటున్న ఘర్షణలను సైనికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే, జూన్ 15న గాల్వన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో గాయపడిన జవాన్లను మిలిటరీ ఆస్పత్రి చేరి పరామర్శించారు.
రాజ్యవిస్తరణ కాంక్షించినవారికి ఓటమే
‘శాంతి, స్నేహం ప్రపంచానికి మంచివని అందరూ భావిస్తారు. కానీ, శాంతిని కోరుకోవడం బలహీనత కాదని, అలా భావించరాదు’ అని ప్రధాని మోడీ అన్నారు. ‘నేడు భారత్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా తనను తాను రక్షించుకునేందుకు తయారవుతున్నది. మా దేశానికి శాంతి చేకూర్చడంలో భాగంగా మరింత దృఢం చేసుకుంటున్నాం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేశాన్ని బలోపేతం చేయడం మా హక్కు. కచ్చితంగా అలాగే చేస్తాం.’ అని అన్నారు. చైనాపై పరోక్షంగా విమర్శలు సంధిస్తూ ‘అభివృద్ధే పురోగమనం. కానీ, కొన్ని శక్తులు ఇప్పటికీ విస్తరణవాదాన్ని నమ్ముతుండటం దురదృష్టకరం. పూర్వం రాజ్యవిస్తరణ కాంక్ష ఉండేది. అందుకు యుద్ధాలు జరిగాయి. ఓటమి పాలయ్యారు. విస్తరణవాదం విధ్వంసానికే దారితీస్తుంది. విస్తరణను కాంక్షించినవారెవరూ విజయవంతులు కాలేరు. నేడు ప్రపంచమంతా అభివృద్ధినే నమ్ముకున్నది. భారత్ కూడా అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది’ అని ప్రధాని వివరించారు.