రోడ్డు ప్రమాదం.. చనిపోతూ ఫ్రెండ్స్‌ను ఇరికించాడు

by Sumithra |   ( Updated:2021-03-26 08:10:24.0  )
రోడ్డు ప్రమాదం.. చనిపోతూ ఫ్రెండ్స్‌ను ఇరికించాడు
X

దిశ, శేరిలింగంపల్లి : మద్యం తాగి వాహనాలు డ్రైవింగ్ చేయరాదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం ఇప్పటికే పలుమార్లు సూచించింది. యువతకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారాలు సైతం నిర్వహిస్తోంది. అయినా, నేటి తరం యూత్‌లో ఏమాత్రం మార్పు కనిపించడంలేదు. తప్పతాగి వాహనాలు డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఫుల్లుగా మ్యదం సేవించి వాహనం నడపడమే కాకుండా, డివైడర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతనితో ట్రావెల్ చేసిన మిత్రులకు తృటిలో ప్రాణాపాయం తప్పగా పోలీసులు వారికి అదిరిపోయే బహుమానం ఇచ్చారు.

మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన విశ్వతేజ(26) స్నేహితులతో కలిసి నానక్ రామ్ గూడాలో ఉంటున్నాడు. త్వరలోనే సొంత వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నాలు సాగిస్తున్నాడు. గురువారం స్నేహితులు ఇంద్రజిత్ వర్మ, సాయివర్మతో కలిసి మాదాపూర్ నోవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌లో పార్టీ చేసుకుని ఫుల్లుగా మద్యం సేవించారు. ఆ తర్వాత అదే మత్తులో కారు నెంబర్ ఏపీ12 ఎం 9090 హ్యుందాయ్ వెర్నా వాహనంలో నానక్ రామ్ గూడా వెళ్లే క్రమంలో మెటల్ చార్మినార్ సమీపంలో అతి వేగంగా కారు నడిపి సర్వీస్ రోడ్డుకి ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో కారు పల్టీ కొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న విశ్వతేజ అక్కడికక్కడే మరణించాడు. గాయాలతో బయటపడిన ఇంద్రజిత్ వర్మ, సాయివర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించిన తర్వాత వాహనం నడిపేలా మృతుడు విశ్వతేజను ప్రోత్సహించిన ఇద్దరు మిత్రులపై 304-II ఆర్/ డబ్ల్యు 109 ఐపీసీ, 3 పీడీపీపీ యాక్టుల ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed