మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడు అరెస్టు

by Shyam |
మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడు అరెస్టు
X

దిశ, క్రైమ్ బ్యూరో : మైనర్ బాలికను వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని చెట్టెంపహడ్ గ్రామానికి చెందిన సాయికుమార్ అలియాస్ సాయి వర్థన్ యాదవ్ హస్తినాపురంలోని నవీనా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. తనకున్న కామవాంఛ తీర్చుకోవడానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్లో మైనర్ బాలికలను సెర్చ్ చేస్తూ.. పరిచయం చేసుకునేవాడు. ఆ తర్వాత ఫోన్ నెంబరు తీసుకుని పర్సనల్ గా చాటింగ్ చేస్తూ ఆకర్షణీయమైన పదాలతో ప్రేమిస్తున్నట్టు నమ్మించేవాడు.

ఇతని మాటలను నమ్మిన అమాయక బాలికలు ప్రేమ పేరుతో చనువుగా వ్యవహారించేవారు. ఈ సమయంలో వారితో దిగిన ఫోటోలు, వారితో చాట్ చేసిన మెస్సేజ్ లను అడ్డుపెట్టుకుని లైంగిక కోర్కెలను తీర్చాలని బలవంతం చేసేవాడు. లైంగిక వాంఛలకు అంగీకరించని వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసేవాడు.

ఇలా హయత్ నగర్ పీఎస్ పరిధిలో 16 ఏళ్ల యువతి రూ.65 వేలను ఇచ్చింది. ఇంకా డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఫోటోలు, చాటింగ్ మేస్సేజ్ లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తానని, మీ కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరింపులకు గురి చేసేవాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మార్చి 13న ఫిర్యాదు చేయగా, పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story