ప్రేమించిన అమ్మాయి కోసం దొంగతనం చేస్తున్న యువకుడు

by Sumithra |   ( Updated:2021-12-09 10:58:06.0  )
DSP-1
X

దిశ, కామారెడ్డి: ప్రేమించిన అమ్మాయి కోసం జల్సాలకు అలవాటుపడిన యువకుడు దొంగతనాలకు అలవాటుపడ్డాడని కామారెడ్డి డీఎస్పీ సోమనాథం తెలిపారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కామారెడ్డి రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడిని కామారెడ్డి పట్టణ పోలీసు బృందం పట్టుకుందన్నారు. అతడిని విచారించగా శ్రీరాంనగర్ కాలనీలో దొంతుల శ్రీవిద్య ఇంట్లో ఈ నెల 7న అర్ధరాత్రి 12తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాలు దొంగిలించినట్టు ఒప్పుకున్నాడని డిఎస్పీ తెలిపారు. ప్రేమించిన అమ్మాయి కోసం జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్టు విచారణలో వెల్లడైందని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోనే కాకుండా ఈ నెల 3న ఆదిలాబాద్ 2 టౌన్ పరిధిలో 1.5 గ్రాముల పుస్తె, వెండి పట్టీలు, అలాగే ఈ నెల 6 న నిజామాబాద్ 4 వ టౌన్ పరిధిలో గడియారాలు, బంగారం, ఇతర వస్తువులు దొంగతనం చేసి రైలు పట్టాల వెంట దాచి పెట్టాడని, అతని నుంచి ఆ వస్తువులను రికవరీ చేయడంతోపాటు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచి వెళ్లవద్దని ప్రజలను కోరారు. ఒకవేళ అలా వెళ్లినప్పుడు పోలీసు స్టేషన్ లో సమాచారం ఇస్తే ఆ ఇంటి చుట్టుపక్కల పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

Stealing-1

రైల్వే మార్గంతో గంజాయి సరఫరా

రైల్వే మార్గం ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ సోమనాథం తెలిపారు. బీహార్ కు చెందిన చోట్కు చౌపాల్, తెనుగు సాయినాథ్ అనే ఇద్దరు వ్యక్తులు కామారెడ్డి రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నట్లు, వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా వారి వద్ద 144 గ్రాముల గంజాయి లభించినట్టు చెప్పారు. రైల్వే మార్గం ద్వారా చోట్కు చౌపాల్ అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి సాయినాథ్ కు ఇస్తే సాయినాథ్ ఇక్కడి వారికి విక్రయిస్తారని పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. గతంలో గంజాయికి అలవాటు పడిన కొందరిని గుర్తించి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని పట్టణ ఎస్.హెచ్.ఓ మధుసూదన్ తెలిపారు. మరికొంత మందికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed