పబ్లిక్ ప్లేసుల్లో చార్జింగ్ పెడుతున్నారా? జాగ్రత్త!

by Harish |
పబ్లిక్ ప్లేసుల్లో చార్జింగ్ పెడుతున్నారా? జాగ్రత్త!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ స్మార్ట్ యుగంలో.. స్మార్ట్‌‌ ఫోన్‌ లేకుండా ఉండగలమా? వామ్మో అస్సలు ఊహించలేం కదా ! పాటలు వినాలన్నా, ఏదైనా ఇన్‌ఫర్మేషన్‌ తెలుసుకోవాలన్నా, గేమ్స్‌ ఆడాలన్నా.. ఇలా అన్నిటికీ మొబైలే దిక్కు. అంతేనా అంతకుమించిన పనులన్నీ.. చకచకా ఇలా వేలి కొనలపై ఈజీగా జరుగుతుంటే.. స్మార్ట్‌ ఫోన్‌ యూజ్‌ చేయకుండా ఎలా ఉండగలం? అదీ నిజమే! మరి మనం ఫోన్‌ను అంతగా వాడుతుంటే.. చార్జింగ్‌ ఇట్టే అయిపోతుంది. అలాంటి సమయంలో పబ్లిక్‌ ప్లేస్‌ల్లో కనపడే చార్జింగ్‌ సాకెట్లలో మన మొబైల్‌కు చార్జింగ్ పెడుతుంటాం. కానీ దానివల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది.

మనం బయటకు వెళ్లినప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక్కోసారి మన ఫోన్ లేదా ల్యాపీలో చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు దగ్గర్లో ఉన్న షాపింగ్ మాల్‌, రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో ఉండే చార్జింగ్ పాయింట్‌లో చార్జ్‌ చేస్తుంటాం. ఇలా ఎక్కడపడితే అక్కడ ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయ్యే ప్రమాదముంది. అంతేకాదు మన పర్సనల్ ఫోటోలు, వీడియోలు నెట్‌లో చక్కర్లు కొట్టొచ్చు. వాటిని అడ్డం పెట్టుకుని హ్యాకర్లు మనల్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చు. ఇలా ఏదోరకంగా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.

ఇదంతా ఎలా జరుగుతుందంటారా? ఎందుకంటే, ఇలాంటి సాకెట్స్ దగ్గర హ్యాకర్లు ‘ఆటో డేటా ట్రాన్స్‌ఫర్‌ డివైజ్‌’లను అమర్చుతారు. ఆ డివైజ్‌ల ద్వారా వాళ్ళు ఫోన్ డేటాను చోరీ చేసి, బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును లూటీ చేసే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లోకి మాల్‌వేర్‌ను పంపించి మన డేటా మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు లాక్‌ చేసేస్తారు. లాక్ ఓపెన్‌ చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేస్తారు. లేదంటే మన పాస్‌వర్డ్, యూజర్‌నేమ్‌‌ను గాడ్జెట్‌లో స్టోర్‌ చేసుకుని ఉంటే.. నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయి డబ్బులు కాజేసేందుకు కూడా అవకాశం ఉంది.

ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు స్మార్ట్‌ఫోన్లను ఎలక్ట్రికల్ సాకెట్స్‌ వద్దే చార్జ్ చేసుకోవాలని.. అది కూడా సొంత కేబుల్ లేదా చార్జర్ ఉపయోగించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అయితే ల్యాప్‌టాప్‌ ఎక్స్‌ట్రా బ్యాటరీ ఒకటి క్యారీ చేయాలి. స్మార్ట్‌ఫోన్‌ విషయానికొస్తే మంచి పవర్‌బ్యాంక్‌ ఒకటి దగ్గరుంచుకోవాలి. ఇవేవీ కుదరపోతే చార్జింగ్‌ స్టేషన్లలోని యూఎస్‌బీ పోర్టులను ఉపయోగించకుండా.. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌ ప్లగ్‌ల ద్వారా సొంత చార్జర్‌తో ఫోన్‌/ల్యాప్‌టాప్‌ చార్జ్‌ చేసుకోవాలి. ఎందుకంటే కరెంట్ ప్రవహించే చోట డేటా ట్రాన్స్‌ఫర్‌ సాధ్యం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్‌ యూఎస్‌బీ పోర్టు ద్వారానే చార్జ్‌ చేసుకోవాల్సి వస్తే, గాడ్జెట్‌ను ఆఫ్‌ చేసి చార్జ్ చేసుకోవాలి. ఇలా అయితే డేటా ట్రాన్స్‌ఫర్‌ జరగదు కాబట్టి ఎవరూ గాడ్జెట్‌లోకి మాల్‌వేర్‌ను పంపిచడం గానీ.. సమాచారాన్ని తస్కరించడం గానీ జరగదు. కాబట్టి బయట ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించడం మంచిది.

Advertisement

Next Story