యెస్ బ్యాంక్ కుంభకోణం.. ఈడీ తనిఖీలు!

by Harish |
యెస్ బ్యాంక్ కుంభకోణం.. ఈడీ తనిఖీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం యెస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం తనిఖీలు జరిపారు. ముంబైలోని గ్లోబల్ టూర్ అండ్ ట్రావెల్, కాక్స్ అండ్ కింగ్స్ గ్రూప్ ప్రమోటర్లు, టాప్ మేనేజ్‌మెంట్‌కు సంబంధమున్న ఐదు ప్రాంగణాల్లో ఈడీ దాడులు చేపట్టింది. దీనికి సంబంధించిన విషయాలను సీనియర్ అధికారి ఒకరు దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాక్స్ అండ్ కింగ్స్ ప్రమోటర్ అజయ్ అజిత్ పీటర్ కర్కర్, సీఎఫ్‌వోలు అభిషేక్ గోయెంకా, అనిల్ ఖండేల్వాల్, ఆడిటర్ నరేష్ జైన్ నివాసాల్లో తనిఖీలు జరిగాయి. అజయ్ అజిత్‌కు మార్చిలోనే నోటీసులు జారీ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

మాజీ యెస్ బ్యాంక్ సీఈవో రవ్‌నీత్ గిల్ పేరుని ప్రస్తావిస్తూ అడాగ్ గ్రూప్, ఎస్సెల్ గ్రూప్, కాక్స్ అండ్ కింగ్స్, దీవాన్ హౌసింగ్ ఫైనాస్, రేడియస్ డెవలపర్, సహానా డెవలపర్స్, అవంత గ్రూప్ లాంటి సంస్థల రుణాలతో భారీగా ఒత్తిడి పెరిగిందని ఈడీ ఛార్జీషీట్‌లలో తెలిపింది. కాక్స్ అండ్ కింగ్స్ గ్రూపునకు యెస్ బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. కాక్స్ అండ్ కింగ్స్ గ్రూపునకు చెందిన ఐదు అనుబంధ సంస్థలు కలిసి యస్ బ్యాంక్ నుండి రూ .3,642 కోట్లు పొందాయి. ఈ విషయంలో అధికారిక ఫిర్యాదును 18 మార్చి 2020 న యెస్ బ్యాంక్ ముందు దాఖలు చేసింది. దర్యాప్తులో కాక్స్ అండ్ కింగ్స్ గ్రూప్ యాజమాన్యం వివిధ స్థాయిలలో రుణాలు పొందటానికి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు, కాక్స్ & కింగ్స్ లిమిటెడ్ (సికెఎల్) విదేశీ అనుబంధ సంస్థల బ్యాలెన్స్ షీట్లను ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. 2019 మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి స్వల్పకాలిక స్లిప్పేజీలకు గురయ్యే ఖాతాదారుల పేర్లతో క్రెడిట్ వాచ్ జాబితాను బ్యాంక్ వెల్లడించినట్టు ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ తరువాత సుమారు రూ. 2,267 కోట్ల రుణాలతో కాక్స్ అండ్ కింగ్స్ రెండవ రుణ గ్రహీతగా ఉన్న విషయం తెలిసిందే. కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) కింద బ్యాంక్ మాజీ సీఎండీ రానా కపూర్, భార్య, కుమార్తెలు రాఖీ, రోష్ని పై ఇప్పటికే ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరితోపాటు కుంభకోణంతో సంబంధముందన్న ఆరోపణలతో మోర్గాన్ క్రెడిట్స్, రాబ్ ఎంటర్‌ప్రైజెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, యెస్ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చింది.

Advertisement

Next Story

Most Viewed