యెస్ బ్యాంకు సంక్షోభంలో నష్టం ఎవరికి!

by Shyam |
యెస్ బ్యాంకు సంక్షోభంలో నష్టం ఎవరికి!
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద ఐదో ప్రైవేట్ బ్యాంకు యెస్ బ్యాంకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మారటోరియం విధించటం.. వినియోగదారులకు నగదు విత్‌డ్రాను రూ. 50,000లకు పరిమితి విధించడం జరిగింది. ఈ పరిణామాలు కస్టమర్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బ్యాంక్ పరపతి దారుణంగా పడిపోవడంతో ఎవ్వరూ మూలధనం అందించేందుకు ముందుకు రావట్లేదు. గడిచిన సంవత్సర కాలం నుంచి యెస్ బ్యాంకు తన మూలధన నిధులను ఆర్జించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత రెండేళ్లుగా యెస్ బ్యాంకు వ్యవహారంలో ప్రతికూల పరిణామాలు జరుగుతుండటంతో ఆర్‌బీఐ.. యెస్ బ్యాంకు వ్యవహారాన్ని గమనిస్తూ వస్తోంది. పరిస్థితులు మారిపోతుండటంతో ఖాతాదారులకు రూ. 50 వేల విత్‌డ్రా పరిమితిని విధించింది.

ఈ నిర్ణయం అనంతరం శుక్రవారం దేశీయ మార్కెట్లలో యెస్ బ్యాంక్ షేర్ ధర భారీగా పడిపోయింది. పరిస్థితి క్లిష్టంగా మారుతుందనే అనుమానంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిపాజిట్ చేసిన వారి సొమ్ముకు ఏ ఢోకా లేదని ప్రకటించారు. అయినప్పటికీ మదుపర్లలో ఆందోళన తగ్గలేదు. ఈ పరిణామాలతో రిటైల్ పెట్టుబడిదారులు అత్యధికంగా నష్టపోయారు. ఇక, డిపాజిట్‌దారులు తమ సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి యెస్ బ్యాంకు కేంద్రాల వద్ద, ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు. అంతేకాకుండా యెస్ బ్యాంకుతో అనుసంధానం కలిగి ఉన్న పేమెంట్ యాప్స్‌లో సేవలు కూడా పనిచేయకుండా నిలిచిపోయాయి.

నేపథ్యం..
2018లో యెస్ బ్యాంకు పనితీరు జోరుగా ఉండేది. ఆ సమయంలో ఎక్కువ మొత్తంలో మదుపర్లు పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత అవకతవకలు బయటపడటంతో ఎక్కువ మొత్తంలో పెట్టిన మదుపర్లు అమ్మకాలకు సిద్ధమయ్యారు. ఒకవైపు చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారు షేర్ ధర ఇంకా పెరుగుతుందని భావించి కొనుగోళ్లు చేస్తూ వచ్చారు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికి యెస్ బ్యాంక్ రిటైల్ ఇన్వెస్టర్ల వాటా సుమారు 48 శాతానికి చేరుకుంది. ప్రస్తుత పరిణామాలతో బ్యాంకులో ఇన్వెస్ట్ చేసిన చిన్న ఇన్వెస్టర్లు ఆందోళనలో పడిపోయారు. ఆర్‌బీఐ సొమ్ము విత్‌డ్రాపై పరిమితిని విధించడంతో శుక్రవారం యెస్ బ్యాంక్ ధర ఏకంగా 85 శాతం పడిపోయి రూ. 5.7 వరకూ వెళ్లింది. మార్కెట్ ముగిసే సమయానికి కొంత పుంజుకుని 54.85 శాతం నష్టంతో రూ. 16.60 వద్ద క్లోజయింది.

మ్యూచువల్ ఫండ్స్‌ తిప్పలు..
ఆర్‌బీఐ నిర్ణయంతో యెస్ బ్యాంకులో అధిక మొత్తంలో వాటాలున్న మ్యూచువల్ ఫండ్ సంస్థలకు భారీ నష్టాలు ఏర్పడే అవకాశాలున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ, ఎస్‌బీఐ ఫండ్ మేనేజ్‌మెంట్, నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్, కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలతో పాటు ఇంకా అనేక మ్యూచువల్ ఫండ్ సంస్థలు యెస్ బ్యాంకులో సుమారు కోటి నుంచి ఐదు కోట్ల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్టు సమాచారం.

ఆర్‌బీఐ చర్యలు..
ఇక, యెస్ బ్యాంకు సంక్షోభాన్ని పునరుద్ధరణ దిశగా తీసుకెళ్లడానికే ఆంక్షల నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. నెల రోజుల్లోగా యెస్ బ్యాంకును గాడిలో పెట్టే నిర్ణయాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రి నుంచి హామీలు వచ్చినప్పటికీ ఖాతాదారులకు నమ్మకం కుదరడంలేదు. యెస్ బ్యాంకు మీద ఆర్‌బీఐ మారటోరియం విధించడంతో ఫోన్‌పే సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించి ఫోన్‌పేకు యస్ బ్యాంకు భాగస్వామ్య బ్యాంకు కావడంతో ఈ అంతరాయం ఏర్పడిందని ఫోన్‌పే సంస్థ వివరించింది. మరోవైపు పేటీఎం కూడా యస్ బ్యాంకు సేవలను నిలిపేయడానికి నిర్ణయం తీసుకుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు తలెత్తడంతో యస్ బ్యాంకు వ్యవహారంలో తమ సొమ్ముని నష్టపోతామనే భయం ఖాతాదారుల్లో మొదలైంది.

ఆర్థిక మంత్రి..
ఈ అంశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఖాతాదారులకు, చిన్న ఇన్వెస్టర్లకు ధైర్యాన్నిచ్చారు. యెస్ బ్యాంకులో సుమారు 49 శాతం వాటాను ఎస్‌బీఐ ఇతర సంస్థలతో కలిసి కొనుగోలు చేయనుందని ఆర్థిక మంత్రి చెప్పారు. దీనికోసం ఆర్‌బీఐ ప్రతిపాదనలు పరిశీలిస్తోందని తెలిపారు. యెస్ బ్యాంకుకు సంబంధించి శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి…నెల రోజుల్లోగా యస్ బ్యాంకును తిరిగి గాడిలో పెడతామని అన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం…ఎస్‌బీఐ సుమారు రూ. 2,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అయితే, దీనికి ఎస్‌బీఐ బోర్డు ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. పైగా ప్రభుత్వం కూడా దీనికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. యస్ బ్యాంకులోని ఖాతాదారుల సొమ్ముకు ఎలాంటి భయమక్కరలేదని, అందరి సొమ్ము భద్రంగా ఉందని ఆమె అన్నారు.

ఈ పరిణామాలు ఇలా ఉండగానే, యెస్ బ్యాంక్ విషయంలో బ్యాంకు వ్యవస్థాపకుడైన రానా కపూర్‌కు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, లుక్ఔట్ నోటీసులు ఇచ్చారు. . శుక్రవారం ముంబైలోని ఆయన నివాసంలో సోదాల అనంతరం ఈ చర్యలు తీసుకుంది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఆయనతో పాటు మరికొంత మంది యెస్ బ్యాంకు అధికారులపై అక్రమ నగదు చలామణి అంశంలో ఆరోపణలు ఉన్నాయి. డీహెచ్ఎల్ఎఫ్ బ్యాంకు ఋణాలు నిరర్ధక ఆస్తులుగా ఉన్నాయి. ఇందులో రానా కపూర్ పాత్ర కూడా ఉందన్న అనుమానాలతో అధికారులు ఆయనని ప్రశ్నించినట్టు వెల్లడించారు. మరో కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన ఋణాలకుగానూ వారి నుంచి రానా కపూర్ డబ్బు తీసుకున్నాడన్న అభియోగాలున్నాయి. ఆ నగదు రానా భార్య అకౌంట్‌కు చేరవేసినట్టుగా ఆధారాలు ఉన్నట్లు, యెస్ బ్యాంకు సంక్షోభానికి జరిగిన అవకతవకల్లో రానా కపూర్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed