మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి : విజయసాయిరెడ్డి

by srinivas |
ycp mp vijaya sai reddy
X

దిశ, వెబ్ డెస్క్: చట్ట సభలలోను, నామినేటెడ్‌ పదవుల్లోను మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని రాజ్యసభలో గురువారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై సభలో మాట్లాడారు. 1962 లోక్‌సభ ఎన్నికల్లో 46.7 శాతం మంది మహిళా ఓటర్లు పాల్గొనగా 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి అది 67.18 శాతానికి పెరిగిందని చెప్పుకొచ్చారు. మహిళల ఓట్లశాతం పెరుగుతున్నా రాజకీయాలలో గానీ, చట్ట సభలలో గానీ మహిళల ప్రాతినిధ్యం పెరగలేదన్నారు.

ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ సేకరించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జాతీయ పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో భారతదేశం చాలా దిగువన ఉండి పోయిందని వాపోయారు. 1998లో 95వ స్థానంలో ఉన్న భారతదేశం 2021 నాటికి 148వ స్థానానికి పడిపోయిందన్నారు. దీనికి విరుద్ధంగా ఇటీవల ఏపీలో జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల్లో 60 శాతం మంది మహిళలకు మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవులు దక్కడం మహిళా ప్రాతినిధ్యం దిశగా వేసిన ముందడగుగా ఆయన అభివర్ణించారు. మొత్తం 86 ఉన్నత పదవులలో 52 మహిళలే దక్కించుకున్నారని వివరించారు.

ఏపీ చరిత్రలోనే ఇదొక అరుదైన రికార్డు అని కొనియాడారు. మహిళా సాధికారిత దిశగా.. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడంలో వైసీపీ చిత్తశుద్ధికి ఇదితార్కాణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 1 లక్షా 50 వేల పంచాయతీలలో 50 శాతం పైగా అంటే 78 వేల పదవులను మహిళలే అలంకరించారన్నారు. మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడానికి రిజర్వేషన్లు ఎంత అవసరమో దీనినిబట్టి స్పష్టం అవుతోందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అన్ని నామినేటెడ్‌ పోస్టులు, చట్ట సభలలో మహిళలకు 50 శాతం స్థానాలను రిజర్వ్‌ చేస్తూ చట్టం తీసుకురావలసిన ఆవశ్యకత ఉందని ఆ దిశగా చట్టం రూపకల్పనకు కృషి చేయవలసిందిగా కేంద్రప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed