ఓబీసీ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు : ఎంపీ సుభాష్ చంద్రబోస్

by srinivas |
Pilli SuBhash Chandraboss
X

దిశ, ఏపీ బ్యూరో: లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఢిల్లీలో మంగళవారం ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇచ్చేలా కేంద్రం బిల్లు రూపొందించడం శుభపరిణామమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్రంలో ఏయే కులాలు వెనకబడి ఉన్నాయో అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అవగాహన ఉంటుందన్నారు.

మరోవైపు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ఓబీసీలకు నేటి వరకు పూర్తిగా న్యాయం జరగలేదని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అభిప్రాయపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ఓబీసీల రిజర్వేషన్లను పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం రూ.1000 కోట్లు నామమాత్రపు బడ్జెట్ కేటాయిస్తుంటే… ఏపీలో సీఎం జగన్ బీసీల అభివృద్ధి కోసం రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ఈ బిల్లుతో 67 ఏళ్ల నుంచి ఓబీసీ కేటగిరీ కింద వెనకబడి ఉన్న కులాలకు న్యాయం జరుగుతుందని లోక్‌సభలో వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం గుర్తించలేని ఓబీసీ కులాలు సుమారు 671 ఉన్నాయని.. ఈ బిల్లు ద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుందని ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed