తెలంగాణలో ‘యాసంగి’ పండగ

by Shyam |
తెలంగాణలో ‘యాసంగి’ పండగ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో యాసంగిపై ఆశలు పెట్టుకున్న రైతులు అంచనాకు మించి పంటలు సాగు చేస్తున్నారు. వానాకాలం సాగు పెరిగినప్పటికీ… దిగుబడులు తగ్గాయి. వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చే సమయంలో కురిసిన వానలతో రైతులు నష్టాన్ని చవి చూశారు. దాదాపు 24లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఈ నేపథ్యంలో యాసంగి సాగుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎక్సెస్​ వర్షాలతో పంటల సాగు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 27జిల్లాల్లో సగటు వర్షపాతాన్ని మించిపోయింది. చెరువులు, రిజర్వాయర్లు, చెక్​డ్యాంల్లో నీరు నిల్వ ఉండటంతో… భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది.

50.35లక్షల ఎకరాల్లో పంటలు

యాసంగి సీజన్​ ఈసారి రికార్డుకెక్కింది. తొలిసారిగా 50లక్షల ఎకరాలు దాటింది. ఇంకోవారం, పదిరోజులు నాట్లు వేసే అవకాశాలున్నాయి. దీంతో ఈసారి అంచనా కూడా దాటిపోతుందని భావిస్తున్నారు. సాధారణ సాగును దాటి..గతేడాదితో పోలిస్తే వందశాతం ఎక్కువ పెరిగింది. బుధవారం నాటికి 39,26,638ఎకరాల్లో వరి వేశారు. గత ఏడాది 24,49,201 ఎకరాల్లో వరి వేయగా… ఈసారి దాదాపు 15లక్షల ఎకరాల్లో అదనంగా సాగు చేస్తున్నారు. మరోవైపు వరిలో దొడ్డు రకాలకే మొగ్గు చూపుతున్నారు. 46లక్షల ఎకరాల్లో వానాకాలం వరి సాగు చేస్తే 32లక్షల ఎకరాలకుపైగా సన్నాలు వేశారు. మొక్కజొన్న సాధారణ సాగు 4.04 లక్షల ఎకరాలు కాగా… గత ఏడాది యాసంగిలో 3.84 లక్షల ఎకరాలు వేశారు. ఈసారి కూడా 3.16లక్షల ఎకరాల సాగు దాటిపోయింది. దీనితో పాటు వేరుశనగ సాగు కూడా పెరిగింది. బుధవారం నాటికి 3.16 లక్షల ఎకరాల్లో సాగైంది. శనగ 2.96 లక్షల ఎకరాల్లో వేశారు.

అంచనాలు మించాయి

బుధవారం విడుదల చేసిన పంటల సాగు నివేదిక ప్రకారం మొత్తం 50,35,188 ఎకరాల్లో పంటలు వేశారు. ఈసాగు ఇంకో నాలుగైదు లక్షల ఎకరాలు దాటుతుందని వ్యవసాయ శాఖ చెప్పుతోంది. మెదక్​ జిల్లాలో గత ఏడాది యాసంగిలో 57వేల ఎకరాల్లో పంటలు వేస్తే.. ఈసారి మాత్రం 1.77 లక్షల ఎకరాలు దాటింది. అదే విధంగా మహబూబ్​నగర్​ జిల్లాలో గత ఏడాది 38వేల ఎకరాల్లో పంటలు వేయగా… ఇప్పుడు 90వేల ఎకరాలు మించింది. వరంగల్​ రూరల్​ జిల్లాలో కూడా గత యాసంగిలో 91 వేల ఎకరాల్లో పంటలు సాగైతే… ఇప్పుడు 1.72 లక్షల ఎకరాలు దాటింది. ఖమ్మం జిల్లాలో గతేడాది 1.69లక్షల ఎకరాల్లో పంటలు వేయగా… ఈసారి 2.68లక్షల ఎకరాలకు చేరింది. నల్గొండ జిల్లాల్లో గతఏడాది 2.98 లక్షల ఎకరాల సాగు ఉంటే… బుధవారం నాటికి 3.60 లక్షల ఎకరాలకు చేరింది.

27 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం

ఈసారి 27 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కేవలం ఆరు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం ఉంది. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, నిర్మల్​, మంచిర్యాల, నిజామాబాద్​, జగిత్యాల జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం ఉండగా… మిగిలిన జిల్లాల్లో మాత్రం 20శాతం కంటే ఎక్కువ నమోదైంది. పలు చెరువులు, రిజర్వాయర్లు ఇంకా నీళ్లలో కళకళలాడుతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 4.79 మీటర్లలో సగటున భూగర్భ జలాలు పెరిగాయి. 26జిల్లాలో 0.1 మీటర్ల నుంచి 8.16 మీటర్ల వరకు సగటున జలాలు పెరిగాయి.

యాసంగి సాగు ఇలా..

పంట సాధారణం గత ఏడాది ప్రస్తుతం
వరి 22,19,326 24,49,201 39,26,638
జొన్న 67,324 37,097 92,493
మొక్కజొన్న 4,04,860 3,84,302 3,16,342
శనగ 2,48,622 3,64,675 2,96,663
మినుములు 18,454 18,552 35,643
పల్లి 3,05,685 2,87,565 1,90,557
కంది 1764 460 4294
మొత్తం 36,93,016 37,23,854 50,35,188

Advertisement

Next Story

Most Viewed