Zelenskyy: యుద్ధం ఆగిపోవాలంటే ఆదొక్కటే మార్గం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ!

by vinod kumar |
Zelenskyy: యుద్ధం ఆగిపోవాలంటే ఆదొక్కటే మార్గం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రమే రష్యా దాడులను ఆపగలమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. రష్యా భూభాగంలో సైనిక లక్ష్యాలను ధ్వంసం చేయడానికి అనుమతించాలని అమెరికాను కోరారు. తాజాగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. గత నెల 30 న రష్యా ఖార్కివ్‌పై వైమానిక దాడి చేసిందని, ఇందులో 6 మంది ఉక్రేనియన్లు మరణించగా మరో 97 మంది గాయపడ్డారని చెప్పారు. రష్యా ఎయిర్‌ఫీల్డ్‌లు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే మాత్రమే ఈ అటాక్స్ ఆపగలమని చెప్పారు. ఈ విషయమై తమ భాగస్వామ్య దేశాలతో చర్చిస్తున్నామని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

రష్యాపై దాడులను తీవ్రతరం చేసి ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే వారు వెనక్కి తగ్గుతారని, అప్పుడు యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా ముందు కొస్తుందని చెప్పారు. రష్యాలో సుదూర క్షిపణులు ప్రయోగించడానికి తమకు అనుమతి ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి అవసరమైన సమాచారాన్ని తన ప్రతినిధులు ఉక్రేనియన్ సహోద్యోగులతో పంచుకున్నారని తెలిపారు. కాగా, ఆగస్టు 30-31 తేదీల్లో ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్టెమ్ ఉమరోవ్ వాషింగ్టన్‌లో అమెరికా అధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌కు ఏఏ ఆయుధాలు అవసరమో వారికి వివరించారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాగా, ఉక్రెయిన్ రష్యాలోకి ప్రవేశించి కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఉక్రెయిన్ పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. అయితే 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 50 బిలియన్ల కంటే ఎక్కువ సైనిక సహాయాన్ని అందజేసింది. కానీ ఆ ఆయుధాలు ఉక్రెయిన్ ప్రాంతంలోనే వినియోగించాలని, రష్యా దాడులను నిలువరించడానికి మాత్రమే వాడాలని షరతు విధించింది. దీంతో ప్రస్తుతం రష్యా దాడులు పెంచిన నేపథ్యంలో యూఎస్ అందించిన ఆయుధాలను రష్యా భూభాగంలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడానికి అనుమతించాలని జెలెన్ స్కీ అమెరికాపై ఒత్తిడి చేస్తున్నారు.

Advertisement

Next Story