Yahya Sinwar: హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి.. ఐడీఎఫ్ దాడిలో హతమైనట్టు కథనాలు !

by vinod kumar |
Yahya Sinwar: హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి.. ఐడీఎఫ్ దాడిలో హతమైనట్టు కథనాలు !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ పోరులో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సెంట్రల్ గాజాలో బుధవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చేసిన దాడుల్లో ముగ్గురు హమాస్ సభ్యులు హతమయ్యారు. వారిలో ఒకరు యహ్యా సిన్వార్ అని పలు కథనాలు పేర్కొన్నాయి. దీనిపై ఇజ్రాయెల్ స్పందించింది. దాడికి గురైన భవనంలో ముగ్గురు హమాస్ మిలిటెంట్లు మృతి చెందినట్టు తమకు సమాచారం అందిందని తెలిపింది. వారిలో సిన్వార్ ఉన్నారా లేరా అనే విషయం తెలుసుకునేందుకు ఐడీఎఫ్, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఐఎస్ఏ)లు దర్యాప్తు చేపట్టాయి. ముగ్గురి మృత దేహాలను స్వాధీనం చేసుకుని డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. అయితే ఉగ్రవాదులు హతమైన భవనంలో బందీలు ఉన్నారనే సంకేతాలు లేవని ఐడీఎఫ్ తెలిపింది. సిన్వార్ మరణంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని పేర్కొంది. మరోవైపు ముగ్గురు మిలిటెంట్లు మరణించినా హమాస్ స్పందించకపోవడం గమనార్హం.

అక్టోబర్ 7 దాడుల్లో సూత్రధారి

2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్లో యహ్వా సిన్వార్ ప్రధాన సూత్రధారి. గాజా స్ట్రిప్‌లో హమాస్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. హమాస్ మాజీ చీఫ్ ఇస్మాయిల్ హనియే జూలై 31న ఇరాన్‌లో హత్యకు గురైన అనంతరం ఆ సంస్థ అధినేతగా బాధ్యతలు చేపట్టాడు. ఎంతో బలమైన నాయకుడిగా పరిగణించబడ్డాడు. అంతకు ముందు కూడా సిన్వార్‌ను చంపడానికి ఇజ్రాయెల్ అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన పలు మార్లు తప్పించుకున్నాడు. అయితే గతంలోనూ ఆయన మరణించారని కథనాలు వెలువడగా వాటిని హమాస్ కొట్టి వేసింది. కాగా, గతేడాది ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో ప్రమేయమున్న హమాస్ అగ్రనాయకత్వంలో సిన్వార్ మాత్రమే మిగిలి ఉన్నారు.

గాజాలో పాఠశాలపై దాడి: 15 మంది మృతి

ఉత్తర గాజాలోని శరణార్థి శిబిరం అయిన జబాలియాలోని అబూ హుస్సేన్ పాఠశాలపై గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడి చేసింది. స్కూల్ వద్ద గుమిగూడిన డజన్ల కొద్దీ హమాస్, ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ ఘటనలో ఐదుగురు పిల్లలతో సహా కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు లెబనాన రాజధాని బీరూట్‌లోనూ ఐడీఎఫ్ విరుచుకుపడినట్టు తెలుస్తోంది. ఈ దాడులపై లెబనీస్ అధికారులు స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed