Sheikh Hasina : షేక్ హసీనాపై సామూహిక నరమేధం అభియోగాలు

by Hajipasha |
Sheikh Hasina : షేక్ హసీనాపై సామూహిక నరమేధం అభియోగాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌‌ను వదిలిపెట్టి భారత్‌కు వచ్చేసినా షేక్ హసీనాను కేసులు వదిలేలా లేవు. సామూహిక నరమేధం, భద్రతా బలగాల దుర్వినియోగం వంటి ఆరోపణలతో ఆమెపై బంగ్లాదేశ్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. షేక్ హసీనా నిరంకుశ పాలన వల్లే నిరసనల్లో పాల్గొన్న 450 మందికిపైగా ఒకే నెల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారంటూ మరో మూడు కేసులనూ నమోదు చేశారు. పోలీసులు, భద్రతా బలగాల కాల్పుల్లో సామూహిక నరమేధానికి బలైన వారంతా ఢాకా, మీర్పూర్, మున్షీగంజ్, సావర్ ప్రాంతాలకు చెందిన వారని అభియోగాల్లో ప్రస్తావించారు.

ఈ మూడు కేసులను బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) ప్రస్తుతం విచారిస్తోంది. వాస్తవానికి 2010 సంవత్సరంలో ఐసీటీని షేక్ హసీనాయే ఏర్పాటు చేశారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 100 మందికిపైగా రాజకీయ విరోధులకు ఐసీటీ మరణశిక్షలు విధించిందని అంటున్నారు. ఇప్పుడు అదే ఐసీటీ విచారించే నిందితుల జాబితాలోకి షేక్ హసీనా పేరు కూడా చేరడం గమనార్హం. షేక్ హసీనా సన్నిహితులు, ఆమె పార్టీకి చెందిన కీలక నేతలను ఈ ట్రిబ్యునల్ విచారించి మూడు కేసులకు సంబంధించిన నిజానిజాలన్నీ తేల్చనుంది.

Advertisement

Next Story

Most Viewed