UK : బ్రిటన్‌లో నిరసనలు హింసాత్మకం.. 100 మంది ఆందోళనకారులు అరెస్ట్

by Hajipasha |
UK : బ్రిటన్‌లో నిరసనలు హింసాత్మకం.. 100 మంది ఆందోళనకారులు అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : బ్రిటన్‌లోని పలు పట్టణాల్లో ఫార్ - రైట్ గ్రూపులు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తతకు దారితీశాయి. దీంతో హల్, లివర్‌పూల్, బ్రిస్టల్, మాంచెస్టర్, స్టోక్-ఆన్-ట్రెంట్, బ్లాక్‌పూల్, బెల్‌ఫాస్ట్ వంటి నగరాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. దీంతో పోలీసులు దాదాపు 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు పలుచోట్ల దుకాణాలను లూటీ చేయడంతో పాటు పోలీసులపైనా దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. మెర్సీసైడ్‌లోని సౌత్‌పోర్ట్‌లో సోమవారం జరిగిన టేలర్ స్విఫ్ట్ థీమ్‌‌డ్ డ్యాన్స్ పార్టీలో ముగ్గురు యువతుల హత్య తర్వాత యూకే నగరాల్లో ఈమేరకు ఉద్రిక్తతలు పెరిగాయి.

లివర్‌పూల్‌లో ఏమైందంటే..

వందలాది మంది ఫాసిస్ట్ వ్యతిరేక నినాదాలు చేస్తూ లివర్‌పూల్‌లోని లైమ్ స్ట్రీట్ స్టేషన్ దగ్గర గుమిగూడారు. అక్కడే నిరసన తెలుపుతున్న దాదాపు వెయ్యి మంది ఫార్ - రైట్ గ్రూపుల ఆందోళనకారులు ఇస్లామోఫోబిక్ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ''శరణార్థులకు స్వాగతం, కానీ నాజీ సంతతి.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి'' అంటూ నినదించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. యూకే కాలమానం ప్రకారం శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ ఆందోళనలు కొనసాగాయి. పోలీసు అధికారులపైకి కొందరు నిరసనకారులు టపాసులు విసిరారు. నగరంలోని వాల్టన్ ప్రాంతంలో ఒక లైబ్రరీకి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆ మంటలను ఆర్పకుండా అగ్నిమాపక సిబ్బందిని కూడా అడ్డుకునేందుకు అల్లరిమూకలు యత్నించారు.

ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఏమన్నారంటే..

ఈ నిరసనలపై ఘాటుగా స్పందించిన ప్రధానమంత్రి కీర్ స్టార్మర్.. ‘‘దేశంలో ద్వేషాన్ని చిమ్మేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం’’ అని ప్రకటించారు. ‘‘భావప్రకటన స్వేచ్ఛ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం రెండూ వేర్వేరు విషయాలు’’ అని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారు ఎవరైనా జైలు శిక్ష, ప్రయాణాలపై నిషేధంతో పాటు ఇతర శిక్షలు కూడా విధిస్తామని యూకే హోం మంత్రి వార్నింగ్ ఇచ్చారు. అందుకు అవసరమైనన్ని జైళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.

Advertisement

Next Story