Typhoon bebinca: చైనాలో బెబింకా తుపాన్ బీభత్సం.. 75 ఏళ్లలో ఇదే అత్యంత ప్రమాదకరం!

by vinod kumar |
Typhoon bebinca: చైనాలో బెబింకా తుపాన్ బీభత్సం.. 75 ఏళ్లలో ఇదే అత్యంత ప్రమాదకరం!
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాలోని షాంగై ప్రావీన్స్‌లో బెబింకా తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం షాంగైని తాకిన తుపాన్ అత్యంత శక్తివంతమైందని అధికారులు భావిస్తున్నారు. దీని కారణంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని షాంఘైలోని అన్ని హైవేలను మూసివేశారు. బస్సుల రాకపోకలను నిలిపివేశారు. బెబింకా కేటగిరీ-1 తుఫాను కాగా గత 75 ఏళ్లలో ఇంత ప్రమాదకరమైన తుపాను చైనాను తాకలేదు. ఈ తరహా శక్తివంతమైన తుపాన్‌1949లో వచ్చింది. ఆ తర్వాత ఇదే తొలిసారి అని చైనా ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది. చైనా వాణిజ్య కేంద్రంగా పరిగణించబడే షాంఘైలో సాధారణంగా ప్రమాదకరమైన తుపానులు సంభవించలేదని తెలిపింది.

వందలాది విమానాలు రద్దు

బెబింకా తుపాన్ కారణంగా షాంఘైలోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో గత రెండు రోజుల్లో వందలాది విమానాలు రద్దు చేశారు. అంతేగాక రైళ్ల రాకపోకలను సైతం నిలిపివేశారు. అయితే చైనాలో ప్రస్తుతం మిడ్ ఆటమ్ పండుగ సందర్భంగా సెలవులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. షాంఘైలోని అనేక రిసార్ట్‌లు, ఉద్యానవనాలు, పర్యాటక ప్రదేశాలను మూసివేసింది. భారీగా విమానాలు రద్దవుతున్న దృష్యా విమానాశ్రయాల్లో ప్రయాణికులు బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వారికి ఆహారం అందించడం వంటి చర్యలు తీసుకున్నారు.

రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చైనా వాతావరణ శాఖ షాంఘైలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెస్క్యూ చర్యల నిమిత్తం సహాయక సిబ్బందిని భారీగా మోహరించింది. అత్యవసర సమయంలో ప్రజలు ఉండటానికి సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. షాంఘై నుంచి దూరంగా ఉన్న అన్ని నౌకలు ఓడరేవుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, చైనాలోని దక్షిణ ప్రాంతం నిరంతరం ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతూనే ఉంది. గత వారమే యాగి తుపాను హెనాన్‌ ప్రావీన్సును తాకగా ఆస్తి నష్టం వాటిల్లింది.

Advertisement

Next Story

Most Viewed