పార్లమెంట్‌లో విశ్వాసాన్ని కోల్పోయిన నేపాల్ ప్రధాని

by Harish |   ( Updated:2024-07-12 13:36:47.0  )
పార్లమెంట్‌లో విశ్వాసాన్ని కోల్పోయిన నేపాల్ ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్ ప్రభుత్వంలో తాజాగా సంక్షోభం తలెత్తింది. ప్రధాన మిత్రపక్షం అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్- యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్(CPN-UML) తన మద్దతును ఉపసంహరించుకోవడంతో పార్లమెంట్‌లో శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓటమిపాలు అయ్యారు. మొత్తం 275 మంది సభ్యులు కలిగిన పార్లమెంట్‌లో 69 ఏళ్ల ప్రచండకు 63 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. తీర్మానానికి వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. మెజార్టీకి రావాల్సిన 138 ఓట్లు రాకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం కూలిపోయింది.

డిసెంబర్ 25, 2022న నేపాల్ ప్రధానిగా ప్రచండ బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని CPN-UML తో కలిసి ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ప్రధానిగా పదవిని చేపట్టినప్పటి నుండి ప్రచండ నాలుగు సార్లు విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నేపాలీ కాంగ్రెస్‌-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మధ్య ముందస్తు ఒప్పందం కుదరడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని ప్రచండను కోరగా అందుకు ఆయన నిరాకరించడంతో పార్లమెంట్‌లో అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఓటింగ్‌లో ఆయనకు తక్కువ ఓట్లు రావడంతో ఓటమిపాలు అయ్యారు.

మరోవైపు పార్లమెంట్‌లో నేపాలీ కాంగ్రెస్‌కు 89 సీట్లు ఉండగా యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్‌కు 78 సీట్లు ఉన్నాయి. మెజారిటీకి అవసరమైన 138 కంటే వారి ఉమ్మడి బలం 167 కావడంతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలి బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పటికే ఆమోదించారు.

Advertisement

Next Story

Most Viewed