పాకిస్థాన్‌లో ఉగ్రదాడి..8 మంది సైనికులు మృతి

by vinod kumar |
పాకిస్థాన్‌లో ఉగ్రదాడి..8 మంది సైనికులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్నూ ప్రాంతంలో ఉన్న చెక్‌పోస్టుపై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం మంగళవారం వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున బన్నూ కంటోన్మెంట్‌పై 10 మంది ఉగ్రవాదులు దాడి చేశారని తెలిపింది. టెర్రిరిస్టులు కంటోన్మెంట్ లోని ప్రవేశించడానిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయని,ఈ క్రమంలోనే పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని చెక్ పోస్టు గోడకు బలంగా ఢీకొట్టారని పేర్కొంది. దీని కారణంగా గోడ కొంత భాగం కూలిపోయి పక్కనే ఉన్న సైనికులు మరణించారని తెలిపింది. అయితే 10మంది ఉగ్రవాదులు కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఆఫ్ఘనిస్థాన్‌ కు చెందిన హఫీజ్‌ గుల్‌ బహదూర్‌ గ్రూప్‌ ప్రమేయం ఉన్నట్టు పాక్ సైన్యం ఆరోపిస్తోంది. ఈ బృందం తెహ్రీక్-ఇ-తాలిబాన్ సంస్థకు అనుబంధంగా ఉందని, గతంలోనూ అనేకసార్లు పాక్ లోపల ఉగ్రవాద దాడులకు ఆప్ఘనిస్థాన్ నుంచి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల పాక్‌లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story