Telegram CEO: టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్

by Harish |   ( Updated:2024-08-25 03:39:35.0  )
Telegram CEO: టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అజర్‌బైజాన్ నుండి లే బోర్గట్‌ విమానాశ్రయానికి తన ప్రైవేటు జెట్‌లో వచ్చిన పావెల్‌ను రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడే ఫ్రెంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌‌లో కంటెంట్ నియంత్రణ లేకపోవడం, నేర కార్యకలాపాలను అదుపు లేకుండా అనుమతించడం, సైబర్ నేరాలు, మోసం తదితర ఆరోపణలపై గతంలోనే పావెల్‌కు అరెస్టు వారెంట్‌ జారీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

దాదాపు 900 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను కలిగి ఉన్న టెలిగ్రామ్, రష్యా, ఉక్రెయిన్, మాజీ సోవియట్ రిపబ్లిక్‌లలో ముఖ్యమైన యాప్. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం గురించిన సమాచారాన్ని అందించడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఎక్కువగా వాడుతున్నారు. మాస్కో, కైవ్ అధికారులు, పౌరులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొంతమంది విశ్లేషకులు యాప్‌ను "వర్చువల్ యుద్దభూమి" అని పిలుస్తారు.

రష్యాలో జన్మించిన పావెల్ దుబాయ్‌లో ఉంటున్నాడు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిస్థితిని సమీక్షిస్తుంది. కొంతమంది రష్యన్ రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు ఫ్రాన్స్ చర్యలను విమర్శించారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రెంచ్ రాయబార కార్యాలయాల వద్ద నిరసనలు చేయాలని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన సంపద $15.5 బిలియన్ల వరకు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed