పాకిస్థాన్‌లో ఉత్కంఠ: ఇంకా వెలువడని ఎన్నికల ఫలితాలు

by samatah |
పాకిస్థాన్‌లో ఉత్కంఠ: ఇంకా వెలువడని ఎన్నికల ఫలితాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగి 60గంటలు దాటినా ఇంకా పూర్తి ఫలితాలను ఎలక్షన్ కమీషన్ రిలీజ్ చేయలేదు. దీంతో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈసీ తీరును నిరసిస్తూ.. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) ఆందోళనలకు పిలుపునిచ్చింది. శాంతియుత నిరసనలు చేపట్టాలని తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు.ఇప్పటి వరకు 265 స్థానాలకు గాను 257 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డట్టు తెలుస్తోంది. ఇంకా 8 సీట్లపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో పీటీఐ మద్దతు ఉన్న ఇండిపెండెంట్లు 102, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) 73, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇతరులు 28 స్థానాల్లో గెలుపొందినట్టు సమాచారం. అయితే వీటిపై అధికారికంగా ప్రకటన రాలేదు. తమకు మెజారిటీ లభించినందున అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానిస్తారని ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ తెలిపింది. మరోవైపు పీఎంఎల్ఎన్, పీపీపీ పార్టీలు రెండూ కేంద్రం, పంజాబ్, బలూచిస్తాన్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. పీపీపీ నేత ఆసిఫ్ అలీ జర్దారీ దీనిపై సమీక్షించేందుకు లాహోర్, ఇస్లామాబాద్‌లలో సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం.కాగా, ఈ నెల 8న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది.

సంకీర్ణం వస్తుందని ముందే ఊహించా: తాత్కాలిక ప్రధాని కాకర్

సంకీర్ణ ప్రభుత్వాన్ని తాను ఊహించినట్టు తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కాకర్ చెప్పారు. జాతీయ అసెంబ్లీ రద్దు తర్వాత గతేడాది ఆగస్టులో బాధ్యతలు స్వీకరించిన కాకర్.. సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని ముందే ఊహించామని, అయితే చర్చలు జరపాల్సింది రాజకీయ పార్టీలేనని వెల్లడించారు.మరోవైపు పాకిస్థాన్‌లో ఎన్నికల సరళిపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. పాక్‌లో నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని తెలిపారు. పలితాలను ప్రతిఒక్కరూ అంగీకరించాలని పేర్కొన్నారు. ‘దేశంలో స్వేచ్ఛ, నిష్పాక్షికమైన ఎన్నికలు జరగాలి. ఓటర్ల నిర్ణయాన్ని తప్పకుండా అంగీకరించాలి. ఎన్నికైన సభ్యులు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడంలో ముందుంటారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

Advertisement

Next Story