SpaceX rocket: ప్రైవేట్ స్పేస్‌వాక్ కోసం..అంతరిక్షంలోకి దూసుకెళ్లిన 'స్పేస్‌ఎక్స్‌' రాకెట్‌

by Maddikunta Saikiran |
SpaceX rocket: ప్రైవేట్ స్పేస్‌వాక్ కోసం..అంతరిక్షంలోకి దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా(Tesla) అధినేత, ఎలాన్‌ మస్క్‌(Elon Musk) నేతృత్వంలోని ‘స్పేస్‌ఎక్స్‌ (SpaceX)’ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్‌వాక్‌ నిర్వహించేందుకు ‘పోలారిస్‌ డాన్‌ (Polaris Dawn)’ అనే ప్రాజెక్టు కింద నలుగురు వ్యోమగాముల(Astronauts)ను అంతరిక్షంలోకి పంపింది. ఈ మేరకు మంగళవారం ఫ్లోరిడా(Florida)లోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌(Kennedy Space Center) నుంచి ఫాల్కన్‌-9(Falcon-9) రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ మిషన్ దాదాపు ఐదు రోజుల వరకు కొనసాగనుంది.ఇదివరకు ప్రయోగించిన డ్రాగన్ మిషన్ కంటే ఎక్కువ ఎత్తుకు ఎగరాలని ఈ నలుగురు వ్యోమగాములు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఈ మిషన్ లో భాగంగా 'స్టార్‌లింక్(Starlink)' యొక్క లేజర్ ఆధారిత కమ్యూనికేషన్‌లను వ్యోమగాములు పరీక్షించనున్నారు.

ఆ నలుగురు వ్యోమగాములు ఎవరు..?

ఈ ముఖ్యమైన మిషన్‌కు Shift4 యొక్క వ్యవస్థాపకుడు 41ఏళ్ల జేర్డ్‌ ఇస్సాక్‌మన్‌(Jared Isaacman) నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి,లెఫ్టినెంట్ కల్నల్ 50 ఏళ్ల స్కాట్‌ పోటీట్(Scott Poteet) దీనికి పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. వారితోపాటు స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఇంజినీర్లు 30 ఏళ్ల సారా గిల్లిస్(Sarah Gillis),38 ఏళ్ల అన్నా మీనన్(Anna Menon) కూడా ఈ మిషన్ లో పాల్గొంటున్నారు.కాగా పోలారిస్‌ మిషన్‌లో భాగంగా తలపెట్టిన మూడు మానవసహిత యాత్రల్లో ఇది మొదటిది. ఈ ప్రాజెక్టులో పూర్తిగా స్పేస్‌ఎక్స్‌ పరికరాలనే ఉపయోగిస్తున్నారు.

Advertisement

Next Story