Minister : పేద ప్రజల సంక్షేమ పథకాలు సత్వరమే అర్హులకు అందాలి

by Kalyani |
Minister : పేద ప్రజల సంక్షేమ పథకాలు సత్వరమే అర్హులకు అందాలి
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న పథకాలను సత్వరమే అర్హులకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం, వివిధ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాపాలన ను జరుపుకుంటున్నామని, ప్రజలకు ప్రజాపాలనను పునరంకితం చేయాలని, ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చే విజ్ఞాపనలకు, ప్రతి అధికారి తన పరిధిలో ఉన్న సమస్యలను సత్వర పరిష్కారం చూపిస్తూ, విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. మండల,గ్రామ స్థాయిలో ప్రజల భూములకు సంబంధించిన సమస్యలపై ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, గతంలో మాదిరి కాకుండా, ప్రజల నుంచి వచ్చే విజ్ఞాపనలు వెంటనే పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమని మంత్రి తెలిపారు.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...

అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలు, విధులను సక్రమంగా నిర్వర్తించాలని, వారి శాఖలకు సంబంధించిన అంశాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని కోరారు.

దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ...

గ్రామాలలో ప్రజలకు సంబంధించిన తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సమస్యలను త్వరగా పరిష్కరించాలని, అధికారులు ఈ అంశాల పట్ల తక్షణమే స్పందించాలని కోరారు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ...

ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల పట్ల అధికారులు సత్వర చర్యలు తీసుకుని ప్రజలకు మేలు జరిగేలా చూడాలని కోరారు.

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ....

ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కు జిల్లా అధికార యంత్రాంగం త్వరితగతిన స్పందించి నష్టాన్ని నివారించుకోగలిగామని, అలాగే పంట నష్టం, ఇండ్ల నష్టం, ఇతర నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక సైతం వెంటనే పంపించినట్లు తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేసే బాధ్యతను జిల్లా అధికారులకు అప్పగించామని, సీజనల్ వ్యాధులు అరికట్టడంలో విజయవంతం అయ్యామని తెలిపారు. శానిటేషన్, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని ఆమె వెల్లడించారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed