నైగర్‌‌లో సైన్యం తిరుగుబాటు.. బందీగా దేశ అధ్యక్షుడు..

by Vinod kumar |
నైగర్‌‌లో సైన్యం తిరుగుబాటు.. బందీగా దేశ అధ్యక్షుడు..
X

నియామి(నైగర్‌) : నైగర్‌ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ బజౌమ్‌‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు చేసింది. అధ్యక్షుడి నివాసాన్ని ప్రెసిడెన్షియల్‌ గార్డు సభ్యులు చుట్టుముట్టి.. బజౌమ్‌, ఆయన కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహ్మద్‌ బజౌమ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు సైన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని కర్నల్‌ మేజర్‌ అమదౌ బద్రామనె నైగర్‌ జాతీయ టీవీ ఛానల్‌లో ప్రకటించారు. ‘‘మహ్మద్‌ బజౌమ్‌ పాలనకు ముగింపు పలకాలని సైన్యం, రక్షణ, భద్రతా దళాలు నిర్ణయించాయి. దేశంలో భద్రతా పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా పేలవమైన పాలన కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని ఆయన వెల్లడించారు. తిరుగుబాటు నేపథ్యంలో దేశ రాజ్యాంగాన్ని రద్దు చేశామని, అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని సైన్యం వెల్లడించింది.

దేశ సరిహద్దులను కూడా తాము మూసివేసినట్లు తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరులు జోక్యం చేసుకోవద్దని పశ్చిమ దేశాలను నైగర్‌ హెచ్చరించింది. 1960లో ఫ్రాన్స్‌ నుంచి నైగర్‌‌కు స్వాతంత్య్రం వచ్చింది. అప్పటి నుంచి నైగర్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై అనేకసార్లు సైన్యం తిరుగుబాటు చేసింది. రెండేళ్ల క్రితమే జరిగిన ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా మహ్మద్‌ బజౌమ్‌ ఎన్నికయ్యారు. ఫ్రాన్స్‌, పశ్చిమ దేశాలకు ఈయన సన్నిహితుడు.

ఈ నేపథ్యంలోనే ఆయన్ను పదవీచ్యుతుడిని చేయడానికి ఇప్పటి వరకు నాలుగు సార్లు కుట్రలు జరిగాయి. ఇక నైగర్‌లో సైన్యం తిరుగుబాటును ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య, ఫ్రాన్స్‌, అమెరికా, ఆఫ్రికా యూనియన్‌ దేశాలు తీవ్రంగా ఖండించాయి. సైన్యం ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తీవ్రంగా స్పందించారు. అధ్యక్షుడు బజౌమ్‌ను తక్షణమే విడుదల చేయాలన్నారు. మరోవైపు బజౌమ్‌ మద్దతుదారులు అధ్యక్ష భవనానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ప్రెసిడెన్షియల్‌ గార్డ్‌ సభ్యులు వారిని అడ్డుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు.

Advertisement

Next Story