పాశ్చాత్య ఆయుధాలు రష్యాను తాకితే తీవ్ర పరిణామాలు: పుతిన్ వార్నింగ్

by vinod kumar |
పాశ్చాత్య ఆయుధాలు రష్యాను తాకితే తీవ్ర పరిణామాలు: పుతిన్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాశ్చాత్య దేశాల ఆయుధాలతో ఉక్రెయిన్ రష్యాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పుతిన్ హెచ్చరించారు. రష్యాపై అటాక్ చేయడానికి చేయడానికి పాశ్చాత్య ఆయుధాలను ఉపయోగించాలని ఐరోపాలోని నాటో సభ్యులు ప్రతిపాదించారని తెలిపారు. అక్కడి నాటో సభ్యులు నిప్పుతో ఆటలాడుతున్నారని, ఇది ప్రపంచ సంఘర్షణను మరింత ప్రేరేపించగలదని చెప్పారు. ఉజ్బెకిస్తాన్‌లో పర్యటనలో ఉన్న పుతిన్ తాష్కెంట్‌లో మీడియాతో మాట్లాడారు. యూరోపియన్ దేశాలు చిన్న భూభాగం, దట్టమైన జనాభా కలిగి ఉన్నాయని..రష్యా భూభాగంలో దాడి చేయడంపై మాట్లాడే ముందు వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఉక్రెయిన్ బలగాలు దాడికి పాల్పడినప్పటికీ, వారికి ఆయుధాలు సరఫరా చేస్తున్న పాశ్చత్య దేశాలే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పాశ్చాత్య సైనికులు ఇప్పటికే ఉక్రెయిన్ లో రహస్యంగా పనిచేస్తున్నట్టు తాను నమ్ముతున్నానని తెలిపారు. యూరప్ లోని చిన్న దేశాలు ఎవరితో ఆడుకుంటున్నాయో తెలుసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సైనిక శిక్షకులను పంపడంపై ఫ్రాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఉక్రెయిన్ టాప్ కమాండర్ తెలిపారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ.. ఉక్రెయిన్ భూభాగంలో ఎవరు ఉన్నా సరైనది అని మేము భావిస్తున్నామని తెలిపారు. ఫ్రెంచ్ దళాలను ఉక్రెయిన్‌కు పంపడం కూడా ప్రపంచ సంఘర్షణకు ఒక అడుగు ముందుకు వేసినట్టేనని తేల్చి చెప్పారు.

కాగా, రష్యా సైనిక స్థావరాలను తటస్థీకరించడానికి కీవ్‌ను అనుమతించాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అలాగే రెండేళ్ళకు పైగా యుద్ధం తర్వాత రష్యాపై దాడులను వేగవంతం చేసేందుకు ఉక్రెయిన్ తమ ఆయుధాలను ఉపయోగించేందుకు అనుమతించాలని కొంతమంది నాటో సభ్యులు కూటమి చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌కు విన్నవించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్పందించిన పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story