కలప అక్రమ రవాణా

by Prasanna |
కలప అక్రమ రవాణా
X

దిశ, నాగార్జునసాగర్: అడవుల రక్షణకు ప్రభుత్వాలు పనిచేస్తుంటే.. అక్రమార్కులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా కలప తరలిస్తున్నారు. అధికారుల కంట పడకుండా ఈ చీకటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదం అధికారుల అలసత్వంతో కాగితాలకే పరిమితమైంది. అటవీని రక్షించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వాల్టా చట్టం రూపొందించింది. చెట్లను నరికి వేయాలంటే అటవీశాఖ, రెవెన్యూ శాఖ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అధికారుల అలసత్వం, దళారులకు వరంగా మారింది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం లో పెదవూర, తిరుమల గిరి సాగర్, అనుముల మండలంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమార్కులు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి రోడ్ల వెంబడి, గుట్టలలో ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లను నరికి ఏ మాత్రం భయం లేకుండా ట్రాక్టర్లు, బొలెరో వాహనాలు, లారీల్లో తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి కలపను తరలిస్తున్నారంటే అధికారులు ఏ మేరకు వ్యాపారులతో లాలూచి పడ్డారో అర్థం చేసుకోవచ్చునని అన్నారు.

కాసులు కురిపిస్తున్న కలప దందా

వేప, తుమ్మ చెట్లను సైతం అక్రమార్కులు వదలడం లేదు. పంట చేలు, గుట్టల ప్రాంతాలోని చెట్లు, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన వృక్షాలు నేలకూలుస్తున్నారు. కలప వ్యాపారులు తక్కువ ధరకు చెట్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిని నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ క్వింటాళ్ల చొప్పున అమ్ముకుంటున్నారు. చెట్ల నరికివేత పై అధికారుల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కలపను అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.అధికారుల అలసత్వం, దళారులకు వరంగా మారింది.నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం లో పెదవూర, తిరుమల గిరి సాగర్, అనుముల మండలంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. టన్నుల కొద్దీ కలప ఇటుక బట్టీలకు తరలుతోంది. అక్రమార్కులు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి రోడ్ల వెంబడి, గుట్టలలో ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులకు తెలియదా?

కలప అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, కలప వ్యాపారులు చేతులు కలపడంతో వారి సంపాదన మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతోందనే ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా.. అప్పుడప్పుడూ తూతూ మంత్రంగా దాడులు చేసి, కేసులు నమోదు చేస్తూ.. పెద్ద ఎత్తున కలపను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటుక బట్టీలు ముసుగులో కలప రవాణా సాగుతుంది. ఇంతా జరుగుతున్నా అక్రమ కలప రవాణాను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు మేలుకోకుంటే భవిష్యత్తులో ఎన్ని మొక్కలు నాటినా నిష్ప్రయోజనమేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నరికివేత, రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story