China floods: సెంట్రల్ చైనాలో భారీ వర్షాలు.. వరదల ప్రభావంతో ఏడుగురు మృతి

by Harish |   ( Updated:2024-07-30 11:27:39.0  )
China floods: సెంట్రల్ చైనాలో భారీ వర్షాలు.. వరదల ప్రభావంతో ఏడుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నడుము లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. స్థానిక నదుల్లో ప్రవాహం భారీగా పెరిగింది. ఈ క్రమంలో వరదల తాకిడికి ఆ ప్రాంతంలో ఏడుగురు మరణించారు, వీరిలో నాలుగు మరణాలు జిక్సింగ్ నగరంలోని నాలుగు గ్రామాల్లో సంభవించాయి, అలాగే మరో ముగ్గురు తప్పిపోయినట్లు అక్కడి రాష్ట్ర మీడియా మంగళవారం నివేదించింది. గత రెండు రోజుల్లోనే వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 22కు పెరిగింది.

చైనాలో భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. జిక్సింగ్‌లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 11,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కేవలం 24 గంటల్లో 645 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 900 ఇళ్లు దెబ్బతిన్నాయి, 1,345 రోడ్లు కూలిపోయాయి. చైనా జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని దక్షిణ, నైరుతి, మధ్యభాగంలో, అలాగే రాజధాని బీజింగ్, హెబీ ప్రావిన్స్, ఉత్తరాన టియాంజిన్‌లో రెండవ అత్యధిక స్థాయి ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ఈశాన్య లియానింగ్ ప్రావిన్స్‌లో, ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న యాలు నదికి వరద పోటెత్తడంతో దండోంగ్, ఉత్తర కొరియా వైపు తీవ్రమైన వరద ప్రవహిస్తుంది. దీంతో సమీపంలో ఉన్న ప్రాంతాల నుండి 10,000 మందికి పైగా ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.

Advertisement

Next Story

Most Viewed