రష్యా - ఉక్రెయిన్ వార్‌కి నేటితో ఏడాది.. యుద్ధం ముగింపు ఎన్నడు?

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-24 03:52:51.0  )
రష్యా - ఉక్రెయిన్ వార్‌కి నేటితో ఏడాది.. యుద్ధం ముగింపు ఎన్నడు?
X

దిశ, వెబ్‌డెస్క్: నెత్తుటి ఏర్లు, అనుమతి ఉన్న దేశాలకు తరలుతున్న శరణార్థులు.. లక్షల్లో కన్నుమూసిన సైనికులు, ధ్వంసమైన భవనాలు, పేకమేడల్లా కూలిన పరిశ్రమలు, వంతెనలు.. ఇది రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మిగిల్చిన విషాదం.. ప్రపంచం అంతా శాంతి కోరుకుంటున్న వేళ రష్యా యుద్ధానికి తెర లేపి ప్రంపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది.

తమను కాదని ఉక్రెయిన్ తీసుకున్న నిర్ణయం పుతిన్ ఆగ్రహానికి కారణమైన వేళ యుద్ధ ట్యాంకర్లతో ఉక్రెయిన్‌ను రష్యా మోహరించి నేటికి ఏడాది పూర్తయింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఇంకా భీకరంగా కొనసాగుతూనే ఉంది. 2022 ఫిబ్రవరి 24న ఈ వార్ మొదలైంది.

యుద్ధానికి దారి తీసిన పరిస్థితులేంటీ?

అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడం రష్యా అధ్యక్షుడు పుతిన్ కోపానికి కారణమైంది. నాటో కూటమి తూర్పు వైపుగా విస్తరణకు ప్రణాళిక చేయడం, ఉక్రెయిన్ ను ఆ కూటమిలో చేర్చుకోవడానికి వ్యూహాలు రచిస్తుండటంతో ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పుతిన్ అడుగులు వేశారు. అందుకు గాను తూర్పు ఉక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడే వారిపై ఉక్రెయిన్ ప్రభుత్వం 2014 నుంచి మారణకాండకు దిగుతోందని సాకుగా చూపి 2022 ఫిబ్రవరి 24న ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో యుద్ధానికి రష్యా దిగింది.

యుద్ధంలో సైనికుల మరణాలు, ఆర్థిక నష్టం ఇలా..

రష్యా - ఉక్రెయిన్ వార్ మొదలైన నాటి నుంచి పోరు భీకరంగా సాగుతోంది. తొలుత రష్యా దూకుడు ప్రదర్శించిన చిన్న దేశమైన ఉక్రెయిన్ రష్యాకు ధీటుగా పోరాడుతోంది. యుద్ధం ప్రారంభమయిన తొలి నాళ్లలో మన దేశానికి చెందిన పౌరులను ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తరలించారు. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 7,199 ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా 11,756 మంది గాయపడినట్లు ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది.

రష్యాకు చెందిన 1,44,440 మంది సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ అంచనా వేసింది. యుద్ధంలో 1,00,000 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్లు నార్వే అంచనా వేసింది. రష్యా దాడుల కారణంగా 8వేల కిలో మీటర్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. యుద్ధం కారణంగా 400 వంతెనలు ఉక్రెయిన్ లో నేలమట్టం అయ్యాయి. ఉక్రెయిన్‌కు 70 వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.

వార్ ముగిసే అవకాశాలు ఉన్నాయా?

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కాస్తా నాటో - రష్యా యుద్ధంలా రూపాంతరం చెందుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. దీంతో అమెరికా ఉక్రెయిన్ వెనక ఉండి సహకారం అందిస్తుందనే వాదనకు బలం చేకూరింది. దీంతో పాటు రష్యాకు వ్యతిరేకంగా ఉన్న అనేక దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికాతో పాటు బ్రిటన్, ఐరోపా యూనియన్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచాయి.

అయితే ఉక్రెయిన్‌పై సైనిక చర్య త్వరగానే ముగుస్తుందని పుతిన్ భావించిన ఉక్రెయిన్ నుంచి ఊహించని విధంగా ప్రతిఘటన ఎదురైంది. దీంతో రష్యా మరో 3లక్షల మంది రిజర్వ్ సైనికులతో పాటు, అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఉక్రెయిన్‌కు సైతం పశ్చిమ దేశాల నుంచి యుద్ధ ట్యాంకులు, దీర్ఘ శ్రేణి క్షిపణులు అందుతున్నాయి.

యుద్ధంపై శాంతి చర్యలు ముందుకు సాగకపోవడం.. రెండు దేశాలు తమ తమ ఎత్తులతో ముందుకెళ్లడం చూస్తుంటే యుద్ధం మాత్రం ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రధాని మోడీ మాత్రం రష్యా అధ్యక్షుడితో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన భేటీలో ఇది యుద్ధాల యుగం కాదని చర్చించుకుని సమస్యకు పరిష్కారాన్ని వెతకాలని పుతిన్‌కు సూచించారు. మరి రానున్న కాలంలో యుద్ధం ఎటు దారితీస్తుందో చూడాలి..

Also Read...

6.8 తీవ్రతతో చైనా సరిహద్దు సమీపంలో భారీ భూకంపం..

Advertisement

Next Story

Most Viewed