బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నిరవధికంగా బంద్

by Harish |
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నిరవధికంగా బంద్
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, అక్కడి విద్యార్థులు చేస్తున్న నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం సభ్యులు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వేలాది మంది విద్యార్థుల మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో దాదాపు ఆరుగురు మరణించినట్లు సమాచారం. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ క్యాంపస్‌లలో బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ పారామిలిటరీ ఫోర్స్‌తో పాటు, స్థానిక పోలీసులను అధికారులు మోహరించారు.

పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారేలాగా ఉండటంతో ముందస్తుగా అక్కడి ప్రభుత్వం బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఒక సర్క్యూలర్‌ను జారీ చేసింది. దాడుల ప్రభావంతో కొంతమంది విద్యార్థులు వసతి గృహాలను విడిచిపెట్టారు. మరికొంత మంది బయటికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో వాటిల్లోనే ఉన్నారు. ప్రస్తుతం, బంగ్లాదేశ్‌లో 56 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ కోటాల క్రింద రిజర్వ్ చేయబడ్డాయి, వీటిలో 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వీరుల పిల్లలు, మనవళ్లకు 30 శాతం, 10 శాతం మహిళలకు, 10 శాతం అభివృద్ధి చెందని జిల్లాలకు చెందిన వారికి, 5 శాతం స్థానిక వర్గాలకు,1 శాతం వికలాంగులకు ఉన్నాయి. అయితే ఈ రిజేర్వేషన్లను సంస్కరించి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని కొంతమంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed