రష్యా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోడీ

by Harish |
రష్యా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీకి అపూర్వమైన గౌరవం లభించింది. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో విశేష సేవలందించినందుకు గానూ 2019లో ప్రకటించిన ఆ దేశ అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్' ను మోడీ మంగళవారం అందుకున్నారు. ఇలాంటి గుర్తింపు పొందిన తొలి భారతీయ నేత ప్రధాని మోడీ కావడం విశేషం. ఈ అవార్డును స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన చేతులతో మోడీకి అందించారు.

అవార్డు స్వీకరించిన అనంతరం భారత ప్రధాని మాట్లాడుతూ, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌ను స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ గౌరవం నా ఒక్కడిది మాత్రమే కాదు, 140 కోట్ల మంది ప్రజలది, నేను ఈ పురస్కారాన్ని భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నాను, భారత్- రష్యా మధ్య శతాబ్దాల నాటి లోతైన స్నేహం, పరస్పర విశ్వాసానికి ఇది ప్రత్యేకమైన గౌరవం. గత రెండున్నర దశబ్దాల్లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు అన్ని దిశలలో బలపడ్డాయి. ఇది కేవలం భారత్-రష్యాకు మాత్రమే కాకుండా యావత్‌ ప్రపంచానికి చాలా ముఖ్యమైనవి, నేటి ప్రపంచ వాతావరణం నేపథ్యంలో భారత్‌, రష్యా భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రపంచ సుస్థిరత, శాంతి కోసం నిరంతర ప్రయత్నాలు జరగాలి, దీని కోసం రెండు దేశాలు కూడా కలిసి పనిచేస్తాయని ప్రధాని మోడీ అన్నారు.

'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్' అవార్డును 1698లో జార్ పీటర్ ది గ్రేట్ జీసస్ మొదటి అపొస్తలుడు, రష్యా పోషకుడైన సెయింట్ ఆండ్రూ గౌరవార్థం స్థాపించారు. ఇంతకుముందు ఈ అవార్డు పొందిన విదేశీ అవార్డు గ్రహీతలలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ అధ్యక్షుడు నూర్సుల్తాన్ నజర్‌బయేవ్, రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్ అధ్యక్షుడు గెదర్ అలీవ్ ఉన్నారు.

Advertisement

Next Story