Plane crashes: అమెరికాలో నివాస ప్రాంతాలపై కూలిన విమానం.. ముగ్గురు మృతి

by vinod kumar |
Plane crashes: అమెరికాలో నివాస ప్రాంతాలపై కూలిన విమానం.. ముగ్గురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం నివాస ప్రాంతాలపై కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పోర్ట్‌ల్యాండ్‌కు తూర్పు ప్రాంతంలో ఉన్న ఫెయిప్యూ నగరంలోని టౌన్ హౌస్ ప్రాంతంలో ట్విన్-ఇంజిన్ సెస్నా 421C అనే చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అకస్మాత్తుగా ఇళ్లపై కూలిపోయింది. విమానం కూలిపోయే సమయంలో అది ఒక స్తంభం, విద్యుత్ లైన్‌లను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి సుమారు నాలుగు ఇళ్లకు వ్యాపించాయని, దీనివల్ల ఆరుకుటుంబాలు ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు మరో వ్యక్తి మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి.

విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే కూలిపోయే ముందు విమానం నుంచి ఎటువంటి ఎమర్జెన్సీకి కాల్స్ రాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణకు ఆదేశించింది. ఘటన జరిగిన ప్రదేశానికి ఇద్దరు పరిశోధకులను పంపిందని, వారు శిధిలాలను డాక్యుమెంట్ చేస్తారని అధికార ప్రతినిధి పీటర్ నడ్సన్ తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాతో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story