పాక్ పాలిటిక్స్ : భుట్టో, నవాజ్ పార్టీల పొత్తు చర్చలు వాయిదా.. ఎందుకు ?

by Hajipasha |
పాక్ పాలిటిక్స్ : భుట్టో, నవాజ్ పార్టీల పొత్తు చర్చలు వాయిదా.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై చర్చలు జరుపుతున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్, బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఇంకా పురోగతిని సాధించలేకపోయాయి. సంకీర్ణ సర్కారులో అధికార పంపిణీపై చర్చలు జరిపేందుకు శుక్రవారం రోజు భేటీ కావాలని ఇరుపార్టీలు తొలుత నిర్ణయించుకున్నాయి. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సమావేశాన్ని శనివారానికి వాయిదా వేశాయి. దీంతో ఇరుపార్టీల పొత్తు ప్రతిపాదన మళ్లీ అటకెక్కిందా అనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇప్పటివరకు ఇరుపార్టీల అగ్రనేతల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం.. ప్రధాని అయ్యేందుకు నవాజ్ షరీఫ్‌కు పీపీపీ మద్దతు ఇవ్వనుంది. దీనికి బదులుగా రాష్ట్రపతి, స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో తాము సూచించే వారినే నియమించాలని పీపీపీ డిమాండ్ చేస్తోంది. ఈవిషయంలో ఇంకా పీఎంఎల్ -ఎన్, పీపీపీల మధ్య రాజీ కుదరలేదని సమావేశాల వాయిదాను బట్టి స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పీఎంఎల్ -ఎన్ పార్టీకి 76 సీట్లు, పీపీపీకి 54 సీట్లు, ఇండిపెండెంట్లుగా పోటీచేసే ఇమ్రాన్ ఖాన్ అనుచురులకు 101 సీట్లు వచ్చాయి. నవాజ్, భుట్టో మధ్య పొత్తు కుదరకపోతే.. పీపీపీతో చేతులు కలిపేందుకు ఇమ్రాన్ అనుచరులు రెడీగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

Next Story