North Kore : యుద్దం దిశగా ఉత్తర కొరియా..కిమ్ వైఖరితో గుబులు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-16 05:27:04.0  )
North Kore : యుద్దం దిశగా ఉత్తర కొరియా..కిమ్ వైఖరితో గుబులు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచం మొత్తం యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ బాంబుల మోత మోగించుకుంటూ ఏళ్లు గడిపేస్తున్నాయి. తాజాగా మధ్యప్రాచ్యంలో అదే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ తో లెబనాన్, ఇరాన్ ల మధ్య నెలకొన్న యుద్ధంతో ఎప్పుడు ఎవరు.. ఎవరి మీద దాడి చేస్తారో తెలియడం లేదు. మరో వైపు ఇందులో అమెరికా ఎప్పుడు జోక్యం చేసుకుంటుందో అది మూడో ప్రపంచయుద్ధంగా ఎప్పుడు మారుతుందో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో దక్షిణాసియాలో ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఇన్ మరింత ఆందోళన కలిగించే చర్యలు చేపడుతున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ విన్ పొరుగుదేశం దక్షిణ కొరియా పట్ల అనుసరిస్తున్న వైఖరి రెండు దేశాల మధ్య యుద్ద వాతవరణాన్ని రగిలించాయి. కిమ్ సైన్యంలో కేవలం వారం రోజుల్లోనే 14 లక్షల మంది యువత చేరడం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. రెండు రోజుల్లోనే 10లక్షల మంది యువకులు సైన్యంలో చేరినట్లుగా ఉత్తర కొరియా ప్రభుత్వం వెల్లడించింది. విప్లవం, ఆయుధాలతో శత్రువును నాశనం చేసే పవిత్ర యుద్ధంలో పోరాడాలని యువకులు నిశ్చయించుకున్నారని, యుద్ధం జరిగితే ప్రపంచపటం నుంచి దక్షిణ కొరియా తుడిచి పెట్టుకుపోతుందని, దాని ఉనికిని అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న ప్రభుత్వ వైఖరిని అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి.

తాజాగా కిమ్ ప్రభుత్వం ఉత్తర, దక్షిణ కొరియాలను కలిపే రోడ్లను, రైల్వేలను బాంబులతో పేల్చి మరి నాశనం చేసింది. దక్షిణ కోరియా తన రాజధాని ప్యోంగ్యాంగ్‌పైకి డ్రోన్‌లను పంపిందని కరపత్రాలు జారవిడిచిందని ఉత్తర కొరియా ఆరోపించిన తర్వాత మాటల యుద్ధం తీవ్రతరమై రెండు దేశాలు సరిహద్దుల వద్ద సైన్యం మోహరింపుకు దారితీసింది. అంతకుముందు ఉత్తరకొరియా తరచూ చెత్త బెలూన్లను దక్షిణ కొరియా వైపు పంపుతోందని సియోల్ ఆరోపించింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 6,000 బెలూన్ల పంపిందని, ఈ బెలూన్ల కారణంగా జూన్‌ నుంచి తమ రాజధాని సియోల్‌కు చెందిన రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలను పలుమార్లు మూసేయాల్సి వచ్చిందని దక్షిణ కొరియా ఆరోపించింది. తమ దేశంపై దాడి చేయడానికి దక్షిణ కొరియా ఏర్పాట్లు చేసుకుంటోందని అనుమానిస్తున్నారు.

ఒకప్పుడు కొరియాగానే ఉండే దేశం తర్వాత రెండు భాగాలుగా విడిపోయింది. ఉత్తరకొరియా నియంత పాలనలో ఉండగా దక్షిణ కొరియా ప్రజాస్వామ్యంలోకి వెళ్లింది. అభివృద్ధి పథంలో కొరియా సాగిపోతోంది. కానీ ఉత్తరకొరియా మాత్రం కరువు కాటకాలతో సతమతమవుతోంది. తాజా వివాదాలతో మరోసారి కొరియాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది. ప్రపంచంలో మూడు ప్రాంతాల్లో సాగుతున్న యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed