Nepal floods: నేపాల్‌లో భారీ వరదలు.. 50 మంది మృతి

by vinod kumar |
Nepal floods: నేపాల్‌లో భారీ వరదలు.. 50 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్‌లో వరదలు విధ్వంసం సృష్టించాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వివిధ ఘటనల్లో 50 మంది మరణించగా.. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. ఖాట్మండు లోయలోని మూడు జిల్లాల్లోనే 32 మంది మరణించగా..12 మంది తప్పిపోయినట్టు వెల్లడించారు. 200కు పైగా వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనలు నమోదయ్యాయని అంచనా వేశారు. ఈ కారణంగా సుమారు1244 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో వరదలు ప్రభావం చూపడంతో పాటు కొండచరియలు విరిగి పడ్డాయి.

39 జిల్లాల్లో రోడ్లు పూర్తిగా మూసుకుపోగా ప్రజా రవాణాలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యల నిమిత్తం ఖాట్మండులో 3,060 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఖాట్మండులో విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నేపాల్ వాతావరణ శాఖ నాలుగు రోజుల పాటు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా వివిధ నదుల నీటి మట్టాలు పెరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.

Advertisement

Next Story